FIFA women’s world cup | ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో స్పెయిన్ సంచలనం నమోదు చేసింది. ఫైనల్ చేరిన తొలిసారే ఫుట్‌బాల్ విశ్వ విజేతగా అవతరించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన తుదిపోరులో స్పెయిన్ మహిళల జట్టు 1-0తో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. ఇరు జట్లకు ఇదే తొలి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ కాగా.. ఒత్తిడిని జయించిన స్పెయిన్ జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క గోల్ నమోదు కాగా.. స్పెయిన్ కు చెందిన స్ట్రయికర్ ఓల్గా కార్మోనా 29వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఎంత ప్రయత్నించినా.. స్కోరు సమం చేయలేకపోయింది.
ద్వితీయార్ధంలో స్పెయిన్ పటిష్ఠ రక్షణ శ్రేణిని ఛేదించేందుకు ఇంగ్లండ్ స్ట్రయికర్లు పదే పదే దాడులకు దిగినా.. ఫలితం లేకపోయింది. గతేడాది యూరోపియన్ చాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలై ఇంటి బాట పట్టిన స్పెయిన్.. ఆ ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకుంది. ప్రపంచకప్ ప్రారంభం నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయింది. పరాజయం ఎరగకుండా ఫైనల్ చేరిన ఇంగ్లిష్ టీమ్‌ను మట్టికరిపించిన స్పెయిన్ తొలిసారి ట్రోఫీని హస్తగతం చేసుకుంది. ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన పోరులో ఆరంభం నుంచి ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడగా.. తొలి అర్ధభాగంలో చక్కటి గోల్ చేసిన స్పెయిన్ చివరి వరకు అదే ఒత్తిడి కొనసాగించడంతో ఇంగ్లండ్‌కు అవకాశం చిక్కలేదు.