పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) ఓపెనింగ్ సంబరాల్లో పొరపాటు జరిగింది. ఆయా దేశాల అథ్లెట్లను పరిచయం చేస్తున్న సమయంలో అపశృతి చోటుచేసుకున్నది. సీన్ నదిలో దక్షిణ కొరియా అథ్లెట్లు వస్తున్న సమయంలో.. ఆ దేశ అథ్లెట్లను ఉత్తర కొరియా అథ్లెట్లుగా పరిచయం చేశారు. దీనిపై దక్షిణ కొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. మళ్లీ ఇలాంటి తప్పును చేయరాదు అని నిర్వాహకుల నుంచి దక్షిన కొరియా హామీ డిమాండ్ చేసింది.
బోట్లో దక్షిణ కొరియా అథ్లెట్లు వస్తున్నప్పుడు.. ఆ అథ్లెట్లను అనౌన్సర్ పరిచయం చేస్తూ.. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పరిచయం చేశారు. అయితే నార్త్ కొరియాకు అధికారిక పేరు అదే. ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో ఆ పేరును ప్రకటించారు.
ఇక నార్త్ కొరియా అథ్లెట్లు కూడా సీన్ నదిలో వస్తున్న సమయంలో.. ఆ పేరుతోనే అథ్లెట్లను ఇంట్రడ్యూస్ చేశారు అనౌన్సర్. పారిస్లో ఉన్న దక్షిణ కొరియా క్రీడా మంత్రి జాంగ్ మిరాన్ ఈ ఘటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ను కలవనున్నట్లు ఆయన తెలిపారు. తప్పు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్వాహకులను దక్షిణ కొరియా కోరింది.
దక్షిణ కొరియా బృందంలో 143 మంది అథ్లెట్లు ఉన్నారు. వారంతా 21 ఈవెంట్లలో పోటీపడనున్నారు. ఇక నార్త్ కొరియా బృందంలో కేవలం 16 మంది అథ్లెట్లు మాత్రమే ఉన్నారు. 2016లో రియోలో జరిగిన క్రీడల తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో ఇప్పుడే ఆ దేశం ఎంట్రీ ఇచ్చింది.