అంటిగ్వా: టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో యూఎస్ఏతో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన గత నాలుగు మ్యాచ్‌లలోనూ కనీసం 120 (115 అత్యధికం) పరుగులు చేయడానికి నానాతంటాలు పడ్డ సఫారీ బ్యాటర్లు.. యూఎస్ఏతో మాత్రం జూలు విదిల్చడంతో బుధవారం అంటిగ్వా వేదికగా జరిగిన పోరులో మార్క్మ్ సేన 18 పరుగుల తేడాతో నెగ్గింది.
క్వింటన్ డికాక్ (40 బంతుల్లో 74, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (32 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) తో పాటు ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్, 3 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
భారీ ఛేదనలో యూఎస్ఏ.. 11.1 ఓవర్లకు 76/5గా ఉన్నా ఆండ్రిస్ గోస్ (47 బంతుల్లో 80 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), హర్మీత్ సింగ్ (22 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటంతో విజయానికి చేరువగా వచ్చినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 176/6 వద్దే ఆగిపోయింది. ప్రొటీస్ బౌలర్లలో రబాడా (3/18) రాణించాడు. డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మోత మోగించిన డికాక్:
తొలుత సౌతాఫ్రికా.. నేత్రవల్కర్ వేసిన 3వ ఓవర్లో ఓపెనర్ హెండిక్స్ (11) వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత ఓవర్ నుంచే అసలు కథ మొదలైంది. మార్క్మ్త్రో జత కలిసిన డికాక్. మార్క్మ్త్రో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. ఆఖర్లో క్లాసెన్, స్టబ్స్ (20 నాటౌట్) మెరుపులతో ఆ జట్టు యూఎస్ఏ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
సంక్షిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 194/4 (డికాక్ 74, మార్క్మ్ 46, నేత్రవల్కర్ 2/21, హర్మీత్ 2/24). యూఎస్ఏ: 20 ఓవర్లలో 176/6 (గోస్ 80 నాటౌట్ , హర్మీత్ 38, రబాడా 3/18, కేశవ్ 1/24)