విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నది. బంగ్లా నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 235/7 స్కోరు చేసింది.
ట్రయాన్(62), కాప్(56) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకమయ్యారు. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో వీరిద్దరు ఆరో వికెట్‌కు 85 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. నహీదా అక్తర్(2/44) రెండు వికెట్లు తీసింది. తొలుత బంగ్లా 50 ఓవర్లలో 232/6 స్కోరు చేసింది. షమీమ్ అక్తర్(50), షోర్న అక్తర్(51 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు.