దక్షిణాఫ్రికా క్రికెట్లో నూతన అధ్యాయం! ఏండ్లకు ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని సఫారీలు సగర్వంగా ఒడిసిపట్టుకున్న క్షణం. 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో టైటిల్ విజేతగా నిలిచిన వైనం. చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తూ దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భం.
నిర్దేశిత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా..ఎయిడెన్ మార్క్మ్(్ర136) సూపర్ సెంచరీతో అపురూప విజయం అందుకున్న సమయం. దుర్భేద్యమైన ఆసీస్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలుస్తూ మార్క్మ్ వీరోచిత పోరాటం అసమానం. దిగ్గజాలకు సాధ్యం కాని అనితరసాధ్యమైన రికార్డును సొంతం చేసుకున్న తెంబా బవుమా నాయకత్వానికి అభిమానుల నీరాజనం. చోకర్స్ ట్యాగ్‌ను చెరిపేస్తూ దక్షిణాఫ్రికా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన వేళా విశేషం.
జూన్ 14, 2025..దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ సందర్భం! ఎన్నో ఏండ్లుగా కండ్లు కాసేలా ఎదురుచూసిన క్షణం ఇన్నాళ్లకు సాకారమైంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర లిఖించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో టైటిల్ విజేతగా నిలిచి తమ చిరకాల కలను సాకారం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. నిర్దేశిత లక్ష్యఛేదనలో సహచరులు విఫలమైనా తాను ఉన్నానంటూ మార్క్మ్ వీరోచిత సెంచరీతో దక్షిణాఫ్రికా విజయంలో కీలకమయ్యాడు. స్టార్ పేస్ త్రయాన్ని దీటుగా ఎదుర్కొంటూ మార్క్మ్ చారిత్రక ఇన్నింగ్స్‌తో కదంతొక్కిన వేళ లార్డ్స్ మైదానం..సఫారీల సంబురంతో కొత్త కలను సంతరించుకుంది.
లండన్: దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయం! ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు దరిచేరింది. లార్డ్స్ మైదానం వేదికగా శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. తద్వారా 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సఫారీలు ఐసీసీ ట్రోఫీని సగర్వంగా దక్కించుకున్నారు. ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 213/2తో శనివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు మార్క్మ్(్ర207 బంతుల్లో 136, 14ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా, గాయాన్ని కూడా లెక్కచేయకుండా కెప్టెన్ తెంబా బవుమా(66) సాధికారిక అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. బవుమా, స్టబ్స్(8), మార్క్మ్ వికెట్లు కోల్పోయినా..బెడింగ్హామ్(21 నాటౌట్), కైల్ వెరినె(4 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. స్టార్క్(3/66)మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అద్భుత సెంచరీతో జట్టు చిరస్మరణీయ విజయంలో కీలకమైన మార్క్మ్క్రు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
నిర్దేశిత లక్ష్యఛేదన కోసం శనివారం ఆట కొనసాగించిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయంతోనే ఇన్నింగ్స్ కొనసాగించిన బవుమా తన ఓవర్‌నైట్ స్కోరు ఒక పరుగు మాత్రమే జతచేస్తూ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో మార్క్మ్త్రో 147 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్..స్టబ్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి జట్టును పోటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.
స్టబ్స్ ఔటయ్యే సమయానికి సఫారీలు విజయానికి 41 పరుగుల దూరంలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన బెడింగ్హామ్..మార్క్మ్క్రు జతకలిశాడు. ము ఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన మార్క్మ్ కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో తన సత్తాఏంటో చూపెట్టాడు. అయితే హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మార్క్మ్ ఔట్ కావడంతో సఫారీ శిబిరంలో ఒకింత ఆందోళన చెలరేగింది. విజయానికి మరో 10 పరుగులు అవసరమైన దశలో వెరినె విన్నింగ్ షాట్‌తో దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
2: దక్షిణాఫ్రికాకు ఇది రెండో ఐసీసీ టైటిల్. 1998లో హ్యాన్సీ క్రానె నాయకత్వంలో దక్షిణాఫ్రికా ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచింది.
27: 1988లో నాకౌట్ ట్రోఫీ గెలిచిన దక్షిణాఫ్రికా 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఐసీసీ టైటిల్‌ను దక్కించుకుంది.
8: దక్షిణాఫ్రికా వరుసగా గెలిచిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇన్ని మ్యాచ్‌లు గెలువడం ఇదే తొలిసారి
9: కెప్టెన్‌గా తొలి 10 టెస్టుల్లో తెంబా బవుమా సాధించిన విజయాలు. అతని కంటే ముందు ఇంగ్లండ్ కెప్టెన్న చాప్మన్ మాత్రమే మొదటి 10 టెస్టుల్లో 9 గెలిచాడు.
136: లక్ష్యఛేదనలో మార్క్మ్ చేసిన స్కోరు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి నాలుగో ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు చేశాడు. ఇంతకుముందు విండీస్ క్రికెటర్ రాయ్ ఫ్రెడెరిక్స్(138) టాప్‌లో ఉన్నాడు.
4 : ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది నాలుగో సారి. 1975, 1996 వన్డే వరల్డ్‌కప్‌లకు తోడు 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఓడింది.
దక్షిణాఫ్రికా క్రికెట్లో నవశకానికి నాంది పడింది. క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరు గాంచిన లార్డ్స్ మైదానం ఇందుకు వేదికైంది. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలనే చందంగా 1999 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి దక్షిణాఫ్రికా ఇన్నేండ్లకు బదులు తీర్చుకుంది. అనాడు గెలిచే మ్యాచ్‌ను చేజేతులా వదిలిపెట్టుకున్న సఫారీలు ఈసారి అలాంటి తప్పును మళ్లీ పునరావృతం చేయకుండా జాగత్త్ర పడారు. నిషేధం నుంచి బయటిపడి 1991లో తిరిగి తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు దక్షిణాఫ్రికాకు ఐసీసీ టోర్నీలు ఎన్నడూ కలిసి రాలేదు.
1992 వన్డే ప్రపంచకప్‌లో వరుణుడు విలన్‌గా మారి వారి తలరాత తలకిందులు చేస్తే ప్రతీ టోర్నీలో వారిని అదృష్టం వెక్కిరిస్తూనే వచ్చింది. 1998లో హ్యాన్సీ క్రానె కెప్టెన్సీలో అందరి అంచనాలు మారుస్తూ నాకౌట్(చాంపియన్స్ ట్రోఫీ) ట్రోఫీ రూపంలో దక్షిణాఫ్రికాకు తొలి ఐసీసీ టైటిల్ దక్కింది. అప్పటి నుంచి దాదాపు ప్రతీ మేజర్ టోర్నీలో సఫారీలకు నిరాశే ఎదురైంది. అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లు ఉన్నా..అదృష్టం కలిసిరాక టైటిల్‌కు ఆమడ దూరంలో నిలిచిన సందర్భాలు కోకొల్లలు. అటు పురుషులతో పాటు మహిళల టోర్నీల్లోనూ ఓటములతో దక్షిణాఫ్రికా ‘చోకర్స్’ ముద్ర మూటగట్టుకుంది. వెస్టిండీస్ వేదికగా నిరుడు జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఈఏడాది ఆరంభంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లోనే వెనుదిరిగింది.
ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణాఫ్రికాకు ఉన్న దురదృష్టం ప్రపంచంలో మరే జట్టుకు లేకపోవడం. అయితే వీటన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ, తమ అదృష్ట రేఖలను మార్చుకుంటూ సఫారీలు ఎట్టకేలకు తమ ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకోవడంలో సఫలమయ్యారు. మెగాటోర్నీల్లో కొరకరాని కొయ్య అయిన ఆస్ట్రేలియాను ఓడిస్తూ డబ్ల్యూటీసీలో చాంపియన్‌గా నిలిచి ఇన్నాళ్లుగా తమపై ఉన్న చోకర్స్ ముద్రను చెరిపేసుకున్నారు. ఈ క్రమంలో దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును కెప్టెన్ బవుమా చేతల్లో చేసి చూపెట్టాడు.