Sikander Bakht : విదేశీ కోచ్‌లంటే పాకిస్తాన్ క్రికెటర్లకు భయమని, వాళ్ల మాటే వింటారని ఆ దేశ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ అన్నాడు. తాజాగా ఒక చర్చా కార్యక్రమంలో సికందర్ మాట్లాడుతూ.. పాక్ ఆటగాళ్లను సరైన మార్గంలో పెట్టడానికి విదేశీ కోచ్‌లను నియమించాలని అన్నాడు. ‘స్వదేశీ కోచ్‌లకంటే విదేశీ కోచ్‌లకే పాక్ క్రికెటర్లు భయపడతారు. జావేద్ మియందాద్, వకార్ యూనిస్, సక్లెయిన్ ముస్తాక్, మిస్బావుల్ హక్ వంటి మాజీ క్రికెటర్లు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. కానీ వీళ్లలో ఒక్కరు కూడా జట్టును గాడిలో పెట్టలేకపోయారు’ అని వెల్లడించాడు. స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. దాంతో, ఆ జట్టును దారిలో పెట్టేందుకు విదేశీ కోచ్ మేలని సికిందర్ అభిప్రాయ పడ్డాడు. అంతేకాదు తాను అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
అప్పుడు ఏం జరిగిందంటే..?
‘అప్పుడు నేను పాకిస్థాన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న రోజులు. హెడ్ కోచ్‌ది దక్షిణాఫ్రికా. అతను ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా కూడా అందరూ అతని మాటే వినేవాళ్లు. అయితే.. అతని పేరు నాకు గుర్తు లేదు. ఒకసారి నేను ఆటగాళ్లకు ఏదో చెప్పాలనుకున్నా. అప్పుడు అతను జోక్యం చేసుకొని.. నేను 40 టెస్టులు ఆడాను. నువ్వు 26 మాత్రమే ఆడావు. నేను వాళ్లతో మాట్లాడతాను అని ముఖం మీదే అన్నాడు’ అని సికందర్ వెల్లడించాడు. సికందర్ 2000-03 మధ్య కాలంలో పాక్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. ఇతను పాక్ తరఫున 26 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు.
కోచ్‌గా మిక్ ఆర్థర్
పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్ పాక్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు అతనితో సంప్రదింపులు జరిపింది. త్వరలోనే అతను పాక్ జట్టుకు ఆన్లైన్ హెడ్‌కోచ్‌గా సేవలు అందించనున్నాడు. అదే జరిగితే.. ప్రపంచంలోనే మొదటి ఆన్లైన్ హెడ్‌కోచ్‌గా ఆర్థర్ గుర్తింపు సాధిస్తాడు.