మ్యూనిచ్: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో యువ షూటర్ సిఫ్ట్కౌర్సమ్రా కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన ఫైనల్లో సిఫ్ట్కౌర్ 453.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. జెనెట్నె హెగ్ (నార్వే, 466.9), ఎమిలీ జెగ్గీ(స్విట్జర్లాండ్, 464.8) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇది వరకే తన పేరిట ప్రపంచ రికార్డు కల్గి ఉన్న 23 ఏండ్ల సిఫ్ట్కౌర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్కు ముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో నీలింగ్, ప్రోన్, స్టాండింగ్ విభాగాల్లో సిఫ్ట్కౌర్ 592 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.