Shreyas Iyer | ఒక కెప్టెన్.. మూడు ఫ్రాంచైజీలు.. ఎక్కడికెళ్లినా బొమ్మ సూపర్ హిట్టు! ప్లేఆఫ్స్ అంటే అదేదో తమకు సంబంధం లేనట్టుగా ఉండే ఢిల్లీని 2020లో ఫైనల్‌కు చేర్చినా.. పదేండ్ల విరామం అనంతరం కోల్‌కతాకు టైటిల్ అందించినా.. 11 ఏండ్ల తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంతో పాటు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలబెట్టినా అది అతడికే చెల్లింది. అతడే పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్.
ఐపీఎల్ పుట్టినప్పట్నుంచి (2008) లీగ్‌లో భాగంగా ఉన్న పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ లెవన్ పంజాబ్) గత సీజన్ దాకా నిలకడలేమికి బ్రాండ్ అంబాసిడర్. ఈ లీగ్‌లో ఆ జట్టు మార్చినంత మంది సారథులను మరే జట్టూ మార్చలేదనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. దాదాపు సీజన్‌కు ఒకరు.. ఒక్కోసారి ఇద్దరి (ఇప్పటిదాకా 17 మంది కెప్టెన్లు ఆ జట్టుకు కెప్టెన్లుగా పనిచేశారు) చొప్పున ఆ జట్టు పగ్గాలు చేపట్టినా కింగ్స్ రాతను మార్చలేకపోయారు. టైటిల్ సంగతి దేవుడెరుగు! కనీసం ప్లేఆఫ్స్‌కు వెళ్లిన సందర్భాలూ రెండంటే రెండే. 2008లో మూడో స్థానంతో ముగించిన ఆ జట్టు.. 2014లో టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. ఆ తర్వాత 11 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ పంజాబ్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టడమే గాక టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా దూసుకుపోతుంది. అన్నింటికి మించి గతంతో పోల్చితే ఈ సీజన్లో ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారింది. పంజాబ్ ఈ స్థాయిలో మారడానికి కారణం సారథి శ్రేయాస్ అయ్యర్. ఆ జట్టు అభిమానులు ‘సర్పంచ్ సాబ్’గా పిలుచుకుంటున్న శ్రేయాస్.. హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి కింగ్స్ గతినీ, గమనాన్నీ పూర్తిగా మార్చేశాడు.
గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయాస్.. ఈ ఏడాది కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు గురించి చెప్పుకోవాల్సిందే. కోల్‌కతాకు దశాబ్దం తర్వాత ఐపీఎల్ ట్రోఫీ అందించినా ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోక వేలానికి వదిలేసింది. ట్రోఫీ గెలిచిన క్రెడిట్ కూడా అతడికి దక్కలేదు. దీనికి తోడు గాయాలు, షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో వైఫల్యంతో జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‌తో పాటు మెగా టోర్నీలో నిలకడగా రాణించి మార్చి నెలలో ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. బోనస్‌గా బీసీసీఐ కాంట్రాక్టునూ తిరిగి పొందాడు. కేకేఆర్ వద్దు పొమ్మన్న శ్రేయాస్‌ను ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో పంజాబ్.. రూ. 26.75 కోట్లతో కండ్లకద్దుకుని తీసుకుని తమ కలను నెరవేర్చమని సారథ్య బాధ్యతలు అప్పగించింది. పంజాబ్ తనపై ఉంచిన నమ్మకాన్ని శ్రేయాస్ నూటికి నూరుపాళ్లూ నిలబెడుతూ ఆ జట్టును 11 ఏండ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు చేర్చాడు.
నాయకుడంటే జట్టును నడిపించడమే గాక విజయాల్లోనూ తన పాత్రను స్పష్టంగా నిర్వర్తిస్తున్నాడు అయ్యర్. ఈ సీజన్లో అతడు 12 ఇన్నింగ్స్‌లలో 48.33 సగటుతో 435 పరుగులు సాధించి పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనబెట్టి మరీ జట్టు కోసం ఓ సెంచరీనీ త్యాగం చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ ఆడిన తొలి మ్యాచ్‌లో 97* రన్స్ చేసి శతకానికి దగ్గరగా వచ్చినా మరో ఎండ్‌లో శశాంక్ సింగ్ బాదుతుంటే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి అతడిని ప్రోత్సహించాడు. సారథి ఇచ్చిన స్ఫూర్తితో పంజాబ్ బ్యాటర్లూ ఫియర్లెస్ అప్రోచ్, అటాకింగ్ బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నారు. ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్, శశాంక్, నెహల్ వంటి కుర్రాళ్ల మెరుపులే ఇందుకు నిదర్శనం.
ఇక కోల్‌కతాతో ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 111 పరుగులకే కుప్పకూలినా తన బౌలర్లపై నమ్మకంతో శ్రేయాస్ తనదైన వ్యూహాలతో మ్యాచ్‌ను కాపాడుకున్నాడు. ఈ సీజన్లో అప్పటి దాకా నిరాశపరిచిన యుజ్వేంద్ర చాహల్‌తో వరుస ఓవర్లు వేయించి ఫలితాన్ని రాబట్టాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు క్రీజులో కుదురుకోనీయకుండా బౌలింగ్ మార్పులు చేస్తూ పంజాబ్‌ను విజయవంతంగా నడిపిస్తున్నాడు. మొన్న ముగిసిన రాజస్థాన్‌తో మ్యాచ్‌లో వేలునొప్పితో ఫీల్డింగ్‌కు రాకపోయినా బౌండరీ లైన్ వద్ద అటూఇటూ తిరుగుతూ స్టాండ్ ఇన్ కెప్టెన్ శశాంక్‌కు బంతిబంతికీ సలహాలు అందించాడు. ఇదే ఊపులో శ్రేయాస్.. పంజాబ్ టైటిల్ కల నెరవేరిస్తే భవిష్యత్‌లో టీమ్ఇండియా పరిమిత ఓవర్ల జట్టు సారథ్య రేసులోనూ నిలుస్తాడనంలో అతిశయోక్తి లేదు.