ఢిల్లీ : భారత యువ పారా ఆర్చర్ శీతల్ దేవీకి అరుదైన గుర్తింపు దక్కింది. 19 ఏండ్ల ఈ జమ్మూకశ్మీర్ అమ్మాయి 2025 సంవత్సరానికి గాను ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైనట్టు వరల్డ్ ఆర్చరీ ప్రకటించింది. నిరుడు గ్వాంగ్జూలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్సిప్లో స్వర్ణం గెలిచిన మొదటి మహిళా ఆర్మ్లెస్ (చేతుల్లేని) ఆర్చర్‌గా రికార్డులకెక్కిన ఆమె నిలకడగా రాణిస్తుండటంతో వరల్డ్ ఆర్చరీ శీతల్‌కు ఈ అవార్డును ప్రకటించింది.
వరల్డ్ చాంపియన్‌లో స్వర్ణమే గాక శీతల్.. పారిస్ పారాలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనే మహిళల టీమ్ సిల్వర్, మిక్స్డ్ టీమ్ కాంస్యంతో సత్తాచాటింది. ఇక ‘ఆర్చర్ ఆఫ్ ది ఇయర్’గా టర్కీకి చెందిన ఎమిర్కన్ హేనీ ఎంపికైంది.