Aman Sehrawat | పారిస్: యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతక విజయం వెనుక అలుపెరుగని కృషి దాగున్నది. పారిస్ ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలన్న కసితో వచ్చిన అమన్…అనుకున్నది సాధించాడు. ఈ క్రమంలో 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కిలోల శరీర బరువు కోల్పోయి కాంస్య పతక పోరుకు సిద్ధమయ్యాడు. జపాన్ రెజ్లర్, స్వర్ణ పతక విజేత రెయి హిగుచి చేతిలో సెమీస్‌లో ఓడిన తర్వాత అమన్ బరువు 61.5 కిలోలకు చేరుకుంది.
శుక్రవారం కాంస్య బౌట్(57కిలోల)లో పోటీపడాలంటే 4.6కిలోల బరువు తగ్గాలి. సమయం చూస్తే బరువు కొలిచేందుకు 10 గంటలు మాత్రమే మిగిలుంది. ఇక్కడే కోచ్‌లు జగ్మిందర్సింగ్, వీరేందర్ దహియా.. సెహ్రావత్‌తో కలిసి రాత్రంతా నిద్రలేకుండా శ్రమించారు. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ 100 గ్రాముల ఉదంతం కండ్ల ముందు కనిపిస్తున్న వేళ మరో పతకాన్ని విడిచిపెట్టుకునేందుకు సిద్ధంగా లేని భారత బృందం ఆ దిశగా ముందుకు సాగింది.
సాయంత్రం 6.30(పారిస్ టైమ్)కు బౌట్ ముగిసిన తర్వాత అమన్ ‘మిషన్ వెయిట్‌లాస్’ మొదలైంది. తొలుత గంటన్నర పాటు మ్యాట్‌పై యువ రెజ్లర్ కుస్తీ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత వేడి నీటితో గంటన్నర స్నానం చేశాడు. రాత్రి 12.30 గంటల సమయంలో జిమ్‌లో నాన్‌స్టాప్‌గా గంట పాటు ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తాడు. దీంతో వచ్చే చెమట ద్వారా బరువు కోల్పోయే అవకాశముంటుంది. 30 నిమిషాల విరామం తర్వాత ఐదేసి నిమిషాల చొప్పున ఐదు సెషన్ల పాటు సోనా బాత్ చేశాడు. లాస్ట్ సెషన్ అయిపోయే సరికి ఇంకా 900 గ్రాములు అధికంగా ఉన్నా డు. కొద్దిసేపు మసాజ్ తర్వాత జాగింగ్, 15 నిమిషాల రన్‌తో అమన్..బరువు ఉదయం 4.30 గంటలకు సరిగ్గా 56.9కిలోలకు చేరుకోవడంతో కోచ్‌లు ఊపిరి పీల్చుకున్నారు.