Litton Das : ఐపీఎల్లో స్టార్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ లిట్టన్ దాస్ అన్నాడు. ప్రపంచంలోని పెద్ద పెద్ద క్రికెటర్లతో గదిని పంచుకోవడం, వాళ్లతో మాట్లాడడం వల్ల తన బ్యాటింగ్ ఇంప్రూవ్ అవుతుందని అతను తెలిపాడు. ముఖ్యంగా ఒత్తిడిలో ఆడడం వల్ల తన ఆటతీరు మెరుగుపడుతుందని లిట్టన్ వెల్లడించాడు. 2023 ఐపీఎల్లో అతడు కోల్కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. డిసెంబర్ 23న కొచ్చిలో జరిగిన మినీ వేలంలో కనీస ధర రూ.50 లక్షలకు లిట్టన్ను కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. షకిబుల్ హసన్ తర్వాత ఐపీఎల్లో ఆడుతున్న రెండో బంగ్లా ఆటగాడిగా లిట్టన్ గుర్తింపు సాధించాడు.
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో లిట్టన్ దాస్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా భారత్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో అతను అకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే.. వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్ నిర్దేశించారు. 27 బంతుల్లో 60 పరుగులు చేసిన లిట్టన్ను కేఎల్ రాహుల్ సూపర్ త్రోతో రనౌట్ చేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. ఈ ఏడాది లిట్టన్ పరుగుల వరద పారించాడు. 42 మ్యాచుల్లో 1,921 రన్స్ చేశాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం మొదటి స్థానంలో ఉన్నాడు.