వనపర్తి జిల్లా చిట్యాల తూర్పు తండా నుంచి ఓ వాలీబాల్ స్టార్ వెలుగులోకి వచ్చింది. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయస్థాయికి చేరుకుంది. తాష్కెంట్(కజకిస్థాన్) వేదికగా జరిగే మహిళల ఆసియా అండర్-17 వాలీబాల్ టోర్నీకి ఎంపికై ఆమె సత్తా ఏంటో చూపెట్టింది. సాధించాలన్న కసికి పట్టుదలతో తోడైతే కొండలనైనా పిండి చేయగలమన్న ధైర్యంతో ముందడుగేసిన ఆ యువ సంచలనం మరెవరో కాదు కత్రావత్ శాంతకుమారి. పేరుకు తగ్గట్టు సౌమ్యంగా ఉన్నా..మైదానంలోకి దిగిందంటే చిరుతను తలపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. బాలానగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శాంత తన తల్లిదండ్రులు పడ్డ కష్టంతోనే ఈస్థాయికి చేరుకున్నానని చెబుతున్నది. ఆసియా టోర్నీ సన్నాహాల్లో భాగంగా ప్రస్తుతం భువనేశ్వర్ క్యాంప్‌లో ఉన్న శాంతకుమారిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్న శాంత తన భవిష్యత్ లక్ష్యాలను ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకుంది.
(వనపర్తి రూరల్)నిరుపేద కుటుంబం నుంచి: పుట్టింది మారుమూల గిరిజన తండాలో. నిరుపేద కుటుంబం. కష్టపడి పనిచేస్తే గానీ పూట గడువని పరిస్థితి. కానీ ఇవేమి శాంత కుమారి ప్రతిభకు అడ్డంకి కాలేదు. ప్రభుత్వ పాఠశాల నుంచి మొదలైన ప్రస్థానం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వరకు చేరిన నేపథ్యం స్ఫూర్తిదాయకం. కత్రావత్ అమ్రునాయక్, బిమిని దంపతులకు శాంత నాలుగో సంతానం. ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లతో చిన్నతనం నుంచి గారాబంగా పెరిగిన వైనం. స్థానిక ప్రభుత్వ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదువుకున్న శాంత…గురుకులంలో సీటు దక్కించుకుని తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది.
గురుకుల ఉపాధ్యాయుల సహకారంతో అటు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రతిభ కనబరిచింది. వాలీబాల్‌ను అమితంగా ఇష్టపడుతూ అంచలంచెలుగా ఎదిగింది. మండల, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ టోర్నీల్లోనూ తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది. చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే తాను లక్ష్యంగా పెట్టుకున్న ఐపీఎస్ స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగా బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో సత్తాచాటుతున్నది. ఇలా ఉజ్బెకిస్థాన్ వేదికగా జూన్ 6 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-17 వాలీబాల్ టోర్నీకి మన రాష్ట్రం నుంచి సుజాత, రిశిత, యామినితో పాటు శాంత ఎంపికైంది. ప్రస్తుతం కళింగ యూనివర్సిటీ(కేఐఐటీ)లో జరుగుతున్న జాతీయ జట్టు సన్నాహక శిబిరంలో శిక్షణ పొందుతున్నది.
దేశం గర్వించేలా సత్తాచాటాలని: శాంత
చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా ఉండాలనే తపన నాలో ఉండేది. మొదట మా అక్క గురుకులంలో సీటు సాధించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ నేను బాగా చదివి అక్క బాటనే అనుసరిస్తూ గురుకుల పాఠశాలలో చోటు దక్కించుకున్నాను. తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకుండా చదువుకోవాలని అక్క, తమ్ముళ్లు అందరం అనుకునేవాళ్లం. అందుకు తగ్గట్లే అందరం ఇప్పుడు గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నాం. మా అక్కల పెండ్లిండ్ల కోసం మాకున్న పొలాన్ని అమ్ముకున్నాం. అప్పుడే అనుకున్నాం..ఉన్న దాంట్లో సర్దుకుంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దనుకున్నాం. మా మూడో అక్క వనపర్తి ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతుండగా, ఇద్దరు తమ్ముళ్లు గురుకుల్లాలో విద్యను అభ్యసిస్తున్నారు.
బతుకుదెరువు కోసం మా తల్లిదండ్రులు షేక్‌పేటలో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలన్న తలంపుతో ఉపాధ్యాయుల సహకారంతో వాలీబాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తే..మరింత పేరు వస్తుందని నమ్మాను. కోచ్‌లు ఇచ్చిన సలహాలు, సూచనతో పలు టోర్నీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచాను. ఈ క్రమంలో కడప, తమిళనాడు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో జరిగిన టోర్నీల్లో ఆడాను. ఆసియా టోర్నీకి నాతో పాటు రాష్ట్రం నుంచి నలుగురం ఎంపికయ్యాం. భారత జట్టుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరింత ప్రతిభతో దేశం గర్వపడే ప్లేయర్‌గా ఎదుగాలనుకుంటున్నాను. నాలాంటి నిరుపేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉన్నత భవిష్యత్‌కు మార్గం సుగమం చేయడం సంతోషంగా ఉన్నది.