ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన స్వంత దేశంలో చివరి సారి ఓ టెస్టు మ్యాచ్ ఆడాలన్న ఆశ ఉన్నట్లు కూడా తన రిటైర్మెంట్ సందర్భంగా చెప్పాడు. కానీ షకీబ్ భద్రత కల్పించే అంశం తమ చేతుల్లో లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఫారూకీ అహ్మద్ తెలిపారు. షకీబ్‌పై దేశంలో కేసు నమోదు అయ్యిందని, అయితే అతనికి వ్యక్తిగత భద్రతను కల్పించలేమని ఫారూక్ అహ్మాద్ వెల్లడించారు. 37 ఏళ్ల షకీబ్ గురువారం టీ20లకు గుడ్‌బై తెలిపాడు. ఈ నేపథ్యంలో అతను అక్టోబర్‌లో స్వదేశంలో జరిగే టెస్టులో ఆడాలన్న కాంక్షను వెల్లడించాడు.
షకీబ్‌కు భద్రత కల్పించే బాధ్యత బోర్డు పరిధిలో లేదని, ఓ వ్యక్తికి వ్యక్తిగత భద్రత బోర్డు కల్పించలేదని, అతనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని, అతనికి భద్రత కల్పించే అంశం ప్రభుత్వ ఉన్నత స్థాయి నుంచి రావాలని ఫారూకీ తెలిపారు. బంగ్లా క్రికెట్ బోర్డు సెక్యూర్టీ ఏజెన్సీ కాదు అని, అది రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కాదు అని, ప్రభుత్వంలో ఎవరితోనూ ఈ అంశం గురించి మాట్లాడలేదని, అతని కేసు కోర్టు పరిధిలో ఉందని, అందుకే ఏమీ చేయలేమని బోర్డు చీఫ్ తెలిపారు.
జూలై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో షకీబ్ పై మర్డర్ కేసు నమోదు అయ్యింది. షేక్ హసీనా పార్టీకి చెందిన ఎంపీ కావడం వల్ల అతనిపై కేసు బుక్ చేశారు. ఒకవేళ తనకు ఫేర్వెల్ మ్యాచ్‌ను ఆర్గనైజ్ చేయకుంటే, అప్పుడు కాన్పూర్ టెస్టే చివరిది అవుతుందని షకీబ్ తెలిపాడు.