న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్‌లో 38 ఏండ్ల జొకో క్వార్టర్స్ చేరి రికార్డుల దుమ్ముదులిపాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్.. 6-3, 6-3, 6-2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)ని మట్టికరిపించాడు. సుదీర్ఘ కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్స్ చేరడం అతడికి ఇది 64వ సారి కావడం విశేషం. అదీగాక అత్యంత పెద్ద వయసులో ఒక సీజన్ నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ క్వార్టర్స్ చేరిన ఆటగాడిగానూ జొకో రికార్డులకెక్కాడు.
సుమారు గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి 12 ఏస్‌లు కొట్టాడు. క్వార్టర్స్ పోరులో అతడు అమెరికా కుర్రాడు టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా జోరు కొనసాగుతున్నది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-1, 6-4తో క్రిస్టియానా బుకా (స్పెయిన్)పై అలవోక విజయం సాధించింది. కాగా 9వ సీడ్ కజకిస్థాన్ అమ్మాయి ఎలీనా రిబాకినాకు చుక్కెదురైంది. నాలుగో రౌండ్లో రిబాకినా.. 4-6, 7-5, 2-6తో అన్‌సీడెడ్ వొండ్రుసొవ (చెక్) చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో సబలెంక, వొండ్రుసోవాతో అమీతుమీ తేల్చుకోనుంది.