Senkoukai Karate | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన కరాటే మాస్టర్ హన్శి శాస్వత్కుమార్ కృషి ఫలించింది. మార్షల్ ఆర్ట్స్‌లో డాక్టరేట్ పొందిన 36 ఏండ్ల శాస్వత్కుమార్ పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 10 సెకన్ల వ్యవధిలో 112 బ్యాక్ఫిస్ట్ పంచ్‌లు సంధించి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బ్యాక్ఫిస్ట్ పంచర్గా రికార్డుల్లోకెక్కాడు. అంతటితో ఆగకుండా గత ఆరేండ్లుగా కరాటేలో వినూత్న ప్రయోగాలకు తోడు తన అద్భుత నైపుణ్యాన్ని జోడిస్తూ భారత్‌లోనే తొలిసారి కరాటేలో కొత్త రకం ‘సెన్కోకాయ్ కరాటే’ను ఆవిష్కరించాడు.
దీనిపై శాస్వత్కుమార్ మాట్లాడుతూ ‘సెన్కోకాయ్ కరాటేకు ఇటీవలే జపాన్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుల నుంచి గుర్తింపు లభించింది. జపాన్ గ్రాండ్‌మాస్టర్ల సలహాలకు కఠోరమైన ప్రాక్టీస్‌తో కరాటేలో కొత్త శైలిని తీసుకొచ్చాను. షాటోకాన్, క్యోకుశిన్, మార్షల్ ఆర్ట్స్ కాంబినేషనన్లో సెన్కోకాయ్ కరాటే ఉంటుంది. సమాజంలో పోకిరీల ఆటకట్టించేందుకు అమ్మాయిలకు ఇది సెల్ఫ్ డిఫెన్స్‌గా ఉపయోగపడుతుంది. సెన్కోకాయ్ కరాటేలో పది వర్జినల్ కటా ఫీచర్లు ఉంటాయి’ అని వివరించాడు. జపాన్ మార్షల్ ఆర్ట్స్ నుంచి శాస్వత్కుమార్ 10వ డాన్ బ్లాక్‌బెల్ట్ అందుకోవడం విశేషం.