Bandminton Rankings |భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర లిఖించింది. ఇటీవల ఆసియా క్రీడల్లో పసిడి పతకం కైవసం చేసుకున్న ఈ జంట.. తాజాగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. తద్వారా పురుషుల డబుల్స్‌లో నంబర్ ర్యాంక్ దక్కించుకున్న తొలి భారత ద్వయంగా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా భారత్ నుంచి గతంలో ప్రకాశ్ పదుకోన్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టాప్ ర్యాంక్ పొందారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధించిన సాత్విక్-చిరాగ్ జంట ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతకం సాధించింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ ఈ ఇద్దరూ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్ తరఫున డబుల్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి జోడీగా చరిత్రకెక్కిన సాత్విక్-చిరాగ్.. తాజాగా మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఈ ఏడాది స్విస్ ఓపెన్ నెగ్గిన ఈ జోడీ.. ఆసియా చాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణంతో మెరిసింది. ఈ ఏడాది జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ నెగ్గడం ద్వారా భారత్ నుంచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ 1000 సిరీస్ నెగ్గిన తొలి జంటగానూ రికార్డు నెలకొల్పింది. అనంతరం కొరియా ఓపెన్‌లోనూ సత్తాచాటింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 15వ ర్యాంక్ దక్కించుకోగా.. శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు. ఇక గాయం నుంచి కోలుకొని తిరిగి కోర్టులో అడుగుపెట్టిన పీవీ సింధు.. పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. ఇటీవల ఆసియా క్రీడల్లోనూ ఈ తెలుగమ్మాయి సెమీస్‌కు చేరలేకపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకున్న సింధు.. 13వ స్థానంలో నిలువగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్-త్రిసా జాలీ జంట 16వ ర్యాంక్ దక్కించుకుంది.