Sanju Samson : పొట్టి క్రికెట్ అంటే చాలు పూనకాలు వచ్చినట్టు ఆడే సంజూ శాంసన్ (Sanju Samson) ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు. ప్రపంచకప్ హీరోగా పంతొమ్మిదో సీజన్లో అడుగుపెట్టిన సంజూ తన మార్క్ విధ్వంసంతో బౌలర్ల భరతం పడుతున్నాడు. తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జెర్సీతో ఆడుతున్న సంజూ.. ఆరంభంలో నిరాశపరిచినా ఇప్పుడు శతకాలతో జట్టును గెలిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీతో సీఎస్కేను గెలుపు తోవ తొక్కించిన ఈ హిట్టర్.. వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పైనా వందతో గర్జించాడు. టాపార్డర్, కెప్టెన్ సహా మిడిలార్డర్ మొత్తం విఫలమైనా ఒంటరి సైనికుడిలా చివరిదాకి నిలిచి.. ఎల్ క్లాసిక్‌లో చెన్నై ఏకపక్ష విజయంలో కీలక పాత్ర పోషించాడీ చిచ్చరపిడుగు.
ప్రతిభ ఉన్నా అవకాశాలు అందిపుచ్చుకోలేని క్రికెటర్‌గా ముద్ర పడిన సంజూ శాంసన్ విధ్వంసక ఆటతో వైరలవుతున్నాడు. పొట్టి క్రికెట్లో తనను మించిన పోటుగాడు లేడని నిరూపిస్తూ పంతొమ్మిదో సీజన్లో రెండో సెంచరీ బాదేశాడు సంజూ. ఒకప్పటిలా తొలి బంతి నుంచి బాదేయడం పక్కనపెట్టి.. పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ చెన్నై గెలుపు పతాకలా అవతరించాడు. ఐపీఎల్లో సంజూకు ఇది ఐదో సెంచరీకాగా.. ఒకే సీజన్లో సీఎస్కే బ్యాటర్‌గా రెండో శతకం. అతడి కంటే ముందు షేన్ వాట్సన్(Shane Watson) 2018 ఎడిషన్‌లో రెండుసార్లు వంద కొట్టాడు.
– Sanju Samson’s 101* off 54 is the first individual century for a CSK player against MI in the IPL
– He is the second batter to hit two tons in the same edition for CSK after Shane Watson in 2018#IPL2026 #MIvsCSK #Cricbuzz #CricketKaAsliApp pic.twitter.com/eNqnyaiPgZ
— Cricbuzz (@cricbuzz) April 23, 2026
ఐపీఎల్లో శాంసన్ తొలి శతకం రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై బాదాడు. 63 బంతుల్లోనే 102 పరుగులతో అదరహో అనిపించాడు. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55 బంతుల్లోనే 102 రన్స్ కొట్టిన సంజూ రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆపై.. పంజాబ్ కింగ్స్‌పైన 2021లో 63 బంతుల్లోనే 119.. పంతొమ్మిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 52 బంతుల్లో, ముంబైపై 54 బంతుల్లో సెంచరీతో రికార్డు నెలకొల్పాడు శాంసన్.
🚨SANJU SAMSON HUNDREDS IN IPL HISTORY
101*(54) vs Mumbai Indians
115*(56) vs Delhi Capitals
119(63) vs Punjab Kings
102*(55) vs Sunrisers Hyderabad
102(63) vs Rising Pune Super Giants2 for CSK
2 for RR
1 for DC pic.twitter.com/63AE5XeK3s— Hello Cricket (@thehellocricket) April 23, 2026
ఐపీఎల్ మొదలైందంటే శాంసన్ మెరుపులు గుర్తుకొస్తాయి. కండబలంతో బంతిని అమాంతం స్టాండ్స్‌లోకి పంపే సంజూ గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున దంచేశాడు. ఇప్పుడు అతడు చెన్నై సూపర్ కింగ్స్ ట్రంప్ కార్టులా మారాడు. పసుపు జెర్సీతో తొలి మూడు మ్యాచుల్లో రెండంకెల స్కోర్ కూడా చేయడి శాంసన్ ఫామ్ అందుకున్నాక కసిదీరా కొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీతో తన తడాఖా చూపిన ఈ డాషింగ్ బ్యాటర్.. వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పైనా శతకంతో సీఎస్కేను గెలిపించాడు.

ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విఫలమవుతున్న వేళ నేనున్నానంటూ చెన్నై మ్యాచ్ విన్నర్‌గా అవతరించిన శాంసన్‌కు కెప్టెన్సీ కట్టబెట్టడమే బాకీ ఉందని క్రీడా పండితులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. ఐపీఎల్-19లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 178.66 స్ట్రయిక్ రేటుతో 293 రన్స్ బాదేసిన సంజూ సీఎస్కేను ప్లే ఆఫ్స్ రేసులో నిలిపాడు.