IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛేదనను ధాటిగా ఆరంభించింది. మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(49), విరాట్ కోహ్లీ(29)లు దూకుడుగా ఆడుతున్నారు. ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీకి పంపిన సాల్ట్ ఇక 3 ఓవర్లో రెచ్చిపోయాడు. వైభవ్ అరోరాకు చుక్కలు చూపిస్తూ 4,6, 4 బాది.. 20 పరుగులు పిండుకున్నాడు. ‘ నేనేమీ తక్కువా’ అన్నట్టు విరాట్ కోహ్లీ.. వరుసగా రెండు స్ట్రెయిట్ సిక్సర్లతో స్పెన్సర్ జాన్సన్‌పై విరుచుకుపడ్డాడు. దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇంకా బెంగళూరు విజయానికి 95 రన్స్ కావాలంతే.
ఊహించినట్టే ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 174 రన్స్ కొట్టింది. కెప్టెన్ అజింక్యా రహానే(56), సునీల్ నరైన్(44)ల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఒకదశలో వీళ్లిద్దరి మెరుపులతో 200 కొట్టేలా కనిపించిన కోల్‌కతాను ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా(3/29), హేజిల్‌వుడ్(2/22)లు 180లోపే కట్టడి చేశారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి కప్పు కోసం నిరీక్షిస్తున్న బెంగళూరు విజయంతో టోర్నీ ఆరంభించేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదేమో.