న్యూఢిల్లీ: సుదీర్ఘ భారత బ్యాడ్మింటన్‌లో ఒక శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. దాదాపు రెండేండ్ల నుంచి కోర్టుకు దూరంగా ఉంటున్న సైనా తన కెరీర్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతమున్న పోటీకి తగ్గట్లు ఫిట్నెస్ లేని కారణంగా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో తొలి పతకం అందించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్న సైనా మోకాలి గాయం కారణంగా టోర్నీలకు దూరమవుతూ వస్తున్నది. చివరిసారి 2023లో సింగపూర్ ఓపెన్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ దిగ్గజం మళ్లీ రాకెట్‌తో బరిలోకి దిగలేదు.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. రెండేండ్ల నుంచి ఆటకు దూరంగా ఉంటున్నా..ఏ రోజు అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించలేదని తెలిపింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సైనా మాట్లాడుతూ ‘రెండేండ్ల కింద నుంచి ఆడటం మానేశాను. వాస్తవంగా నా ఇష్టంతోనే ఆటలోకి వచ్చాను, అదే రీతిలో వైదొలుగుతున్నాను. అందుకే రిటైర్మెంట్పై అధికారికంగా ప్రకటించాలనుకోలేదు. ఆడేందుకు కావాల్సిన సరైన ఫిట్నెస్ లేనప్పుడు తప్పుకోవడం మంచిది.
ఈ నిర్ణయానికి గాయాల సమస్యనే ప్రధాన కారణం. మోకాలిలో కార్టిలెజ్(మృదులాస్థి) పూర్తిగా అరిగిపోయింది. అర్థరైటిస్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతమున్న స్థితిలో మెరుగ్గా రాణించాలంటే రోజుకు 8 నుంచి 9 గంటలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కానీ రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తేనే మోకాలు ఉబ్బిపోయి కనీసం నడిచేందుకు వీలు లేకుండా పోతుంది. తీవ్రమైన నొప్పితో ఒత్తిడి భరించలేకపోతున్నాను’ అని సైనా చెప్పుకొచ్చింది. తన రిటైర్మెంట్ నిర్ణయంపై తల్లిదండ్రులు, కోచ్‌కు ముందే చెప్పినట్లు సైనా వివరించింది. ఇదిలా ఉంటే భారత బ్మాడ్మింటన్కు దిక్సూచిగా నిలిచిన సైనాను స్ఫూర్తిగా తీసుకుంటూ చాలా మంది యువ ప్లేయర్లు తమ కెరీర్లను ఎంచుకున్నారు. తన కెరీర్లో ఒలింపిక్స్ మెడల్‌తో పాటు ఆసియా, కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్‌షిప్, సూపర్ సిరీస్‌లు గెలిచిన సైనా అరుదైన రికార్డులు నెలకొల్పింది. సైనా ప్రతిభకు గుర్తింపుగా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర(2010) అవార్డుతో పాటు అర్జున(2009) సొంతం చేసుకుంది.