Wriddhiman Saha : దేశవాళీ క్రికెట్లో ఆడే అవకాశం రావాలే గానీ ఎగిరి గంతేస్తారు ఎవరైనా. ఎందుకంటే..? అద్భుత ప్రదర్శన చేస్తే సెలెక్టర్ల దృష్టిలో పడొచ్చని, దాంతో, టీమిండయా జెర్సీ వేసుకోవచ్చని చాలామంది క్రికెటర్లు అనుకుంటారు. అయితే.. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓపెనర్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) మాత్రం అవకాశాన్ని వదులుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy) సెలక్షన్స్‌లో పాల్గొనకూడదని ఈ వికెట్ కీపర్ నిర్ణయం తీసుకున్నాడు.
దులీప్ ట్రోఫీలో ఆడే విషయమై త్రిపుర సెలెక్టర్ జయంత దే(Jayanta Dey) సాహాను సంప్రదించాడు. సాహా చెప్పిన సమాధానం విని అతను కాసింత ఆశ్చర్యపోయాడు. ఇంతకు ఈ త్రిపుర ఆటగాడు ఏం చెప్పాడో తెలుసా..? ‘నేను భారత జట్టుకు ఆడే అవకాశమే లేనప్పుడు.. యువ ఆటగాళ్లకు అడ్డు తగలడం ఏమాత్రం సమంజసం కాదు. దేశవాళీ ట్రోఫీలో సత్తా చాటిన యువ క్రికెటర్లకు టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అందుకని వాళ్లకు అవకాశం ఇవ్వండి’ అని చెప్పాడట. దాంతో, యంగ్‌స్టర్ అభిషేక్ పొరెల్(Abishek Porel)ను సాహా స్థానంలో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జయంత దే తాజాగా వెల్లడించాడు. దాంతో, మాజీ క్రికెటర్లతో సహా పలువురు సాహను అభినందిస్తున్నారు. జూన్ 28 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
విజయ్‌శంకర్ – వృద్ధిమాన్ సాహా
సాహా 2021లో భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. రిషభ్ పంత్(Rishabh Pant), ఇషాన్ కిషన్(Ishan Kishan) వంటి యువ ఆటగాళ్లు వికెట్ కీపింగ్‌లో రాణిస్తుండడంతో సెలెక్టర్లు సాహాను పక్కనబెట్టారు. పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడడంతో అతడి ప్లేస్‌లో శ్రీకర్ భరత్(Srikar Bharat) వచ్చాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రాణించిన అతడినే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడించారు. దాంతో, ఇక తనకు దారులు మూసిపోయినట్టేనని సాహాకు అర్దమైంది. అందుకని అతను ఐపీఎల్ మీదే దృష్టి పెట్టాడు. 16వ సీజన్లో శుభ్‌మన్ గిల్(Shubhman Gill)తో కలిసి గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభాలు ఇచ్చాడు. 17 మ్యాచుల్లో 129.2 స్ట్రైక్ రేటుతో 371 రన్స్ కొట్టాడు.