మాస్కో: రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారిణి కమిలా వలీవాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆమెకు ఓకే చెప్పింది. డ్రగ్స్ పరీక్షలో విఫలమైన ఫిగర్ స్కేటర్ కమిలా వలీవాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని క్రీడా కోర్టు ఆదేశించింది. 15 ఏళ్ల స్కేటర్ కమిలా.. వింటర్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం ముందంలో ఉన్నది. కానీ గత ఏడాది నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఆమె ఫెయిల్ అయ్యింది. అయితే ఆ పరీక్ష నివేదికను ఈమధ్యనే రిలీజ్ చేశారు. దీంతో ఆమెపై కొన్ని రోజుల క్రితం నిషేధం విధించారు. ఈ కేసులో సీఏఎస్ కోర్టు తీర్పునిస్తూ.. రష్యా స్కేటింగ్ క్రీడాకారిణిని ఈ దశలో అడ్డుకుంటే ఆమెకు తీరన లోటు జరుగుతుందని కోర్టు పేర్కొన్నది. అథ్లెట్‌కు 16 ఏళ్లు కూడా నిండలేదని, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నుంచి ఆమెకు రక్షణ లభిస్తుందని సీఏఎస్ తెలిపింది. స్కేటర్ వలీవా నిషేధిత డ్రగ్ ట్రైమెటాజైడిన్ తీసుకున్నట్లు డిసెంబర్ 25వ తేదీన జరిపిన పరీక్షలో తేలింది. కానీ ఫిబ్రవరి 8వ తేదీన ఆమెపై చర్యలు తీసుకున్నారు. వింటర్ ఒలింపిక్స్‌కు పూర్తిగా ప్రిపేరైన తర్వాత ఈ చర్యలు తీసుకోవడం సబబు కాదు అని కోర్టు చెప్పింది. క్రీడా కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా ఒలింపిక్ అధికారులు సీఏఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గోల్డ్ మెడల్ ఫెవరేట్ అయిన వలీవా మంగళవారం తొలి ప్రదర్శన ఇవ్వనున్నది.