ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. తమ గురికి తిరుగులేదని నిరూపిస్తూ షూటర్లు పతకాల వేటలో దూసుకెళుతున్నారు. మహిళల 10మీటర్ల ఎయిర్పిస్టల్లో రుబినా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి షాట్ వరకు హోరాహోరీగా సాగిన పోరులో రుబిన అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆర్చరీలో కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న శీతల్‌దేవి, సరితాదేవికి నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శివరాజన్, కృష్ణ నాగర్ ఓటమిపాలయ్యారు.
Paralympics | పారిస్: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పోటీల రెండో రోజైన శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబినా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో సత్తాచాటింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పతక పోరులో రుబిన 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, డిఫెండింగ్ చాంపియన్ సారెహ్ జావన్మర్ది(ఇరాన్, 236.8), ఓజ్గాన్ ఐసెల్(టర్కీ, 231.1) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఇరాన్ షూటర్‌కు ఇది వరుసగా మూడో పారాలింపిక్స్ పసిడి పతకం కావడం విశేషం. పారాలింపిక్స్ పిస్టల్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా రుబిన అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అర్హత రౌండ్లో 556 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచిన ఈ మధ్యప్రదేశ్ యువ షూటర్ పతక పోరులో అదరగొట్టింది.
తొలి 10 షాట్లు పూర్తయ్యే సరికి 97.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన రుబిన..14వ షాట్ పూర్తయ్యే సరికి నాలుగుకు పడిపోయింది. అయితే అద్భుతంగా పుంజుకున్న ఈ యువ షూటర్ రౌండ్ రౌండ్‌కు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. చివరి నిమిషంలో వైల్డ్‌కార్డ్ ద్వారా పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన మెకానిక్ కూతురైన రుబిన తన పతక కలను సాకారం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన రుబిన..దిగ్గజ షూటర్ గగన్ నారంగ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ షూటింగ్ కెరీర్ ఎంచుకుంది. తన తండ్రి సైమన్ ఫ్రాన్సిస్..రుబినాకు మద్దతుగా నిలిచారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా…ఎక్కడా వెనుకకు తగ్గకుండా కూతురు షూటింగ్లో రాణించేందుకు అన్ని విధాలుగా సహకరించాడు. పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన రుబినాను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు.
శీతల్, సరితకు నిరాశ:
మహిళల ఆర్చరీలో శీతల్‌దేవి, సరితాదేవికి నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్స్‌లో శీతల్‌దేవి 137-138తో మరియానా జునిగా(చిలీ) పాయింట్ తేడాతో ఓటమిపాలైంది. రెండు చేతులు లేకపోయినా..మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శీతల్ కనబరిచిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మరో క్వార్టర్స్‌లో సరితాదేవి 135-141తో ఎలోనెరా సర్టి(ఇటలీ) చేతిలో ఓడింది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శివరాజన్ 12-21, 10-21తో కూంబ్స్(బ్రిటన్) చేతిలో ఓడాడు. మరో సింగిల్స్ లో కృష్ణ నాగర్ 16-21, 18-21తో మిలెస్ క్రాజెస్కీ(అమెరికా)పై ఓటమిపాలయ్యాడు.