బండ్లగూడ, ఫిబ్రవరి 5: జాతీయ మాస్టర్స్ గేమ్స్‌లో ఆర్టీసీ ఉద్యోగి కొంగళ్ల శ్రీనివాస్ మూడు పతకాలతో సత్తాచాటారు. గచ్చిబౌలి వేదికగా జరిగిన మాస్టర్స్ పోటీల్లో ఆదివారం శ్రీనివాస్ రెండు పసిడి పతకాలు, ఒక రజతం కైవసం చేసుకున్నారు. 50-54 ఏజ్ గ్రూప్‌లో బరిలోకి దిగిన ఆయన ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ దూసుకెళ్లారు. జాతీయ మాస్టర్స్ గేమ్స్‌లో సత్తాచాటిన శ్రీనివాస్‌ను తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగంతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని అన్నారు. మూడు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని వెల్లడించారు.