చెన్నైని చెన్నైలో ఓడించాలని 17 ఏండ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కల ఎట్టకేలకు నెరవేరింది. ఐపీఎల్ మొదటి (2008) సీజన్ తర్వాత బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిదంబరం స్టేడియంలో తొలిసారి మట్టికరిపించింది. శుక్రవారం చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేసింది.
RCB | చెన్నై: ఐపీఎల్-18ను గెలుపుతో ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. శుక్రవారం చెన్నెలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు.. 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 196/7 పరుగుల భారీ స్కోరు చేసింది. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. భారీ ఛేదనలో చెన్నై.. బ్యాటింగ్ వైఫల్యంతో 20 ఓవర్లలో 146/8కే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. రజత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ (30 బంతుల్లో 31, 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభమే అందించారు. సాల్ట్.. ఖలీల్ తొలి ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో ఖాతా తెరిచాడు. అశ్విన్ రెండో ఓవర్లో 6, 4, 4తో 16 పరుగులు పిండుకున్నాడు. అయితే ఐదో ఓవర్లో బౌలింగ్ మార్పుగా వచ్చిన నూర్.. చెన్నైకి తొలి బ్రేక్‌నిచ్చాడు. వికెట్ల వెనుక ధోనీ మరోమారు మాయ చేయడంతో సాల్ట్ స్టంపౌట్ అయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన పడిక్కల్ (14 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. అయితే అశ్విన్ 8వ ఓవర్లో వేసిన ఆఫ్ బ్రేక్ బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఆడబోయిన పడిక్కల్.. గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో స్పెల్‌లో బంతినందుకున్న నూర్.. 13వ ఓవర్లో రెండో బంతికి కోహ్లీని ఔట్ చేశాడు. పడిక్కల్ స్థానంలో వచ్చిన సారథి పాటిదార్ మరోసారి ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సీఎస్కే ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బతికిపోయిన అతడు.. లివింగ్స్టన్ (10), జితేశ్ (12) విఫలమైనా అతడు బెంగళూరు స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. రజత్ ఔట్ అయినా ఆఖర్లో టిమ్ డేవిడ్.. కరన్ వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.
బెంగళూరు ఇన్నింగ్స్‌కు పూర్తి విరుద్ధంగా చెనై బ్యాటింగ్ సాగింది. హెజిల్వుడ్ రెండో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (5)తో పాటు కెప్టెన్ రుతురాజ్‌ను డకౌట్ చేశాడు. భువీ వేసిన ఐదో ఓవర్లో హుడా (4).. జితేశ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 30/3. స్పిన్నర్ల రాకతో చెన్నై పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డైట్టెంది. క్రీజులో రచిన్, దూబే ఉన్నప్పటికీ 12 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 75/4గానే ఉంది. ఇక 13వ ఓవర్లో యశ్ దయాల్.. తొలి బంతికి రచిన్‌ను, ఐదో బంతికి దూబేను క్లీన్‌బౌల్డ్ చేయడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో ధోనీ (15 బంతుల్లో 26 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులోకి వచ్చి మెరుపులు మెరిపించడమొక్కటే చెన్నై అభిమానులకు ఊరట!
బెంగళూరు 20 ఓవర్లలో 196/7 (రజత్ 51, సాల్ట్ 32, నూర్ 3/36, పతిరాన 2/36);
చెన్నై: 20 ఓవర్లలో 146/8 (రచిన్ 41, ధోనీ 30 నాటౌట్, హేజిల్‌వుడ్ 3/21, దయాల్ 2/18)