వడోదర : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 2024 సీజన్లో విజేతగా నిలిచి నిరుడు అవమానకరంగా నిష్క్రమించిన ఆ జట్టు.. తాజా సీజన్లో బలంగా పుంజుకుని ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ.. 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్రేస్ హారీస్ ఆల్‌రౌండ్ షో (37 బంతుల్లో 75, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో యూపీ నిర్దేశించిన 144 పరుగుల ఛేదనను బెంగళూరు 13.1 ఓవర్లలోనే ఊదేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (27 బంతుల్లో 54 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించింది. అంతకుముందు వారియర్స్.. దీప్తి శర్మ (43 బంతుల్లో 55, 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మెగ్ లానింగ్ (41) ఆదుకోవడంతో 143/8 చేయగలిగింది. నదైన్ డి క్లెర్క్ (4/22) నాలుగు వికెట్ల ప్రదర్శనకు తోడు హారీస్ (2/22), శ్రేయాంక పాటిల్ (1/27) యూపీని కట్టడిచేశారు. ఈ విజయంతో నేరుగా ఫైనల్ చేరిన బెంగళూరు.. ఫిబ్రవరి 5న ఎలిమినేటర్ పోరులో విజేతతో ఫైనల్ ఆడుతుంది.
తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో స్వల్ప ఛేదనను ఆరంభించిన హారీస్.. క్రీజులో ఉన్నంతసేపు యూపీకి గెలుపుపై ఆశల్లేకుండా బాదేసింది. క్రాంతి వేసిన మూడో ఓవర్ల ఏకంగా ఐదు బౌండరీలు బాది 20 రన్స్ రాబట్టింది. మరో ఎండ్‌లో స్మృతి ఆమెకు స్ట్రైకింగ్ ఇస్తూ పూర్తి సహకారమందించడంతో పవర్‌ప్లేలో బెంగళూరు వికెట్లేమీ నష్టపోకుండా 63 రన్స్ చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే తొలి బంతిని సిక్స్‌గా మలిచిన హారీస్.. 28 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించింది. ట్రైయాన్ 9వ ఓవర్లో స్మృతి హ్యాట్రిక్ ఫోర్లతో ఆర్సీబీ 9 ఓవర్లకు వంద పరుగుల మార్కును దాటేసింది. ఎట్టకేలకు శిఖా పదో ఓవర్లో హారీస్‌ను బౌల్డ్ చేయడంతో 55 బంతుల్లో 108 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్న బెంగళూరు.. గెలుపు ముంగిట జార్జియా (16) వికెట్‌ను కోల్పోయినా స్మృతి హాఫ్ సెంచరీతో పాటు మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది.
యూపీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు దీప్తి, లానింగ్ మినహా మిగిలినవారంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు నిలకడగా ఆడి 8 ఓవర్లలో 74 రన్స్ జతచేశారు. కానీ ఈ ద్వయం ఇచ్చిన శుభారంభాన్ని తర్వాత వచ్చిన బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. 9వ ఓవర్లో నదైన్.. లానింగ్, జోన్స్‌ను ఔట్ చేసి యూపీకి డబుల్ షాకులిచ్చింది. హారీస్ వరుస ఓవర్లలో హర్లీన్ (14), ట్రైయాన్ (6)ను బోల్తా కొట్టించడంతో యూపీ తడబడింది. చివరి వరుస బ్యాటర్లు సైతం నిరాశపరచడంతో ఆ జట్టు మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది.
యూపీ: 20 ఓవర్లలో 143/8 (దీప్తి 55, లానింగ్ 41, నదైన్ 4/22, హారీస్ 2/22);
బెంగళూరు: 13.1 ఓవర్లకు 14 (హారీస్ 75, స్మృతి 54*, శోభన 1/24, శిఖా 1/36)