India Vs England | లార్డ్స్ : ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా భారత్‌తో గురువారం నుంచి మొదలైన మూడో టెస్టును ఇంగ్లండ్ నెమ్మదిగా ఆరంభించింది. పూర్తి ఎండకాచిన పిచ్‌పై భారత పేసర్లు ఆతిథ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బెన్ స్టోక్స్ సేన.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 నాటౌట్, 9 ఫోర్లు) శతకానికి ఒక్క పరుగుదూరంలో నిలవగా, ఒలీ పోప్ (104 బంతుల్లో 44, 4 ఫోర్లు), కెప్టెన్ స్టోక్స్ (39 నాటౌట్, 3 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2/46) రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా (1/26), జస్ప్రీత్ బుమ్రా (1/35) తలా ఓ వికెట్ పడగొట్టారు.
లార్డ్స్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తన సహజసిద్ధమైన ఆటకు పూర్తి విభిన్నంగా ఆడింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనింగ్ ద్వయం జాక్ క్రాలీ (18), బెన్ డకెట్ (23) ఆచితూచి బ్యాటింగ్ చేశారు. వికెట్‌కు రెండువైపులా స్వింగ్ లభించడంతో భారత పేసర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఆకాశ్ దీప్ 8వ ఓవర్లో క్రాలీ రెండు బౌండరీలు రాబట్టినా ఆ తర్వాత మళ్లీ స్కోరు వేగం పుంజుకోలేదు. డ్రింక్స్ విరామం తర్వాత గిల్.. నితీశ్‌కు బంతినివ్వగా అతడు సారథి నమ్మకాన్ని నిలబెడుతూ ఒకే ఓవర్లో ఆతిథ్య జట్టుకు డబుల్ షాకులిచ్చాడు. మొదట నితీశ్ వేసిన షాట్ బాల్‌ను లెగ్ సైడ్ ఆడబోయిన డకెట్.. వికెట్ల వెనుకాల పంత్‌కు చిక్కాడు. మరో రెండు బంతుల తర్వాత క్రాలీ కూడా పంత్‌కే క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లీష్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. తొలి సెషన్లో ఆ జట్టు 25 ఓవర్లలో చేసింది 3.32 సగటుతో 83 పరుగులే..
రెండో సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ నత్తకు నడక నేర్పినట్టుగా మారింది. రూట్, పోప్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో ఆ జట్టు స్కోరు వేగం మందగించింది. 36 ఓవర్లకు ఇంగ్లండ్.. మూడంకెల స్కోరుకు చేరుకుంది. 102 బంతుల్లో రూట్ అర్ధశతకం పూర్తైంది. రెండో సెషన్లో స్టోక్స్ సేన 24 ఓవర్లు ఆడగా చేసిన పరుగులు 70 మాత్రమే.
రెండో సెషన్ అనంతరం వేసిన మొదటి ఓవర్లోనే జడేజా.. పోప్‌ను ఔట్ చేసి 109 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. హ్యారీ బ్రూక్ (11) రెండు బౌండరీలతో జోరు కనబరిచినా బుమ్రా వేసిన మ్యాజికల్ డెలివరీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బ్రూక్ స్థానంలో వచ్చిన సారథి స్టోక్స్.. రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. చివరి సెషన్లో కాస్త జోరు పెంచిన ఈ జోడీ.. అజేయమైన ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించింది.
సంక్షిప్త స్కోర్లు : ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 83 ఓవర్లలో 251/4 (రూట్ 99*, పోప్ 44, నితీశ్ 2/46, జడేజా 1/26)
లార్డ్స్ టెస్టుకు ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. లార్డ్స్‌లోని ఎంసీసీ మ్యూజియంలో సచిన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. స్టువర్ట్ పీర్సన్ అనే కళాకారుడు ఈ చిత్రపటాన్ని వేశారు. 18 ఏండ్ల క్రితం తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా పూర్తిగా ఆయిల్ పేయింట్స్‌తో గీసిన ఈ చిత్రపటాన్ని స్వయంగా టెండూల్కరే ఆవిష్కరించాడు. అనంతరం సచిన్.. లార్డ్స్‌లో గంట మోగించి మూడో టెస్టును అధికారికంగా ప్రారంభించడం గమనార్హం.
నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అనంతరం కెప్టెన్ గిల్.. ఈ ఆల్‌రౌండర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే నితీశ్ మాతృభాష అయిన తెలుగులో గిల్ మెచ్చుకోవడం గమనార్హం. తన తొలి ఓవర్లోనే ఓపెనర్లను ఔట్ చేసిన తర్వాత రెండో ఓవర్ వేసిన నితీశ్.. రూట్‌కు అద్భుతమైన బంతిని సందించాడు. అక్కడే స్లిప్స్‌లో ఉన్న గిల్.. నితీశ్‌తో ‘బాగుందిరా మామ’ అని చెప్పడం స్టంప్‌మైక్‌లో రికాైర్డెంది.
సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ‘దూకుడు’తో కొత్త సొబగులొద్ది తమ ఆటతీరుతో సుదీర్ఘ ఫార్మాట్‌ను వినోదాత్మకంగా మార్చిన ఇంగ్లండ్.. లార్డ్స్‌లో మాత్రం ‘బజ్‌బాల్’ ఎరా కంటే ముందు జట్టును తలపించింది. మెక్కల్లమ్, స్టోక్స్ కలయికలో గత మూడేండ్లుగా స్వదేశం, విదేశం అన్న తేడాలేకుండా చెలరేగుతున్న ఆ జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ ఓటమితో పూర్తి డిఫెన్స్ మోడ్‌లోకి వచ్చేసింది. ఓవర్‌కు 4, 5 రన్‌రేట్‌కు తగ్గకుండా బాదుతూ ఒకేరోజు 450+ స్కోరును అవలీలగా చేయగలిగే ఆ జట్టు.. లార్డ్స్‌లో మాత్రం చతికిలపడింది.
తొలి రెండు సెషన్లలో ఆ జట్టు రన్‌రేట్ 2-3 మధ్య ఊగిసలాడింది. బజ్‌బాల్ ఎరాలో ఇంగ్లండ్ 72 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తే కనీసం 3 కంటే తక్కువ రన్‌రేట్ నమోదుకావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో ఇదే లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఆ జట్టు రన్‌రేట్ 2.72గా నమోదైంది. రెండో సెషన్లో ఇంగ్లండ్ రన్‌రేట్ 2.91 గా నమోదైందంటే ఆ జట్టు ఎంత నెమ్మదిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.