దేశవాళీలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఉపేక్షించేది లేదని ముందే హెచ్చరించిన బీసీసీఐ.. ఇప్పుడు దాన్ని చేతల్లో చూపెట్టింది. రంజీ ట్రోఫీపై ఆసక్తి కనబర్చకుండా.. వ్యక్తిగత వ్యాపకాల్లో నిమగ్నమైన టీమ్ఇండియా యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బోర్డు షాకిచ్చింది. వార్షిక కాంట్రాక్ట్‌లో నుంచి వారికి ఉధ్వసన పలికింది. ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్న రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజాను ఏ ప్లస్ గ్రేడ్‌కు ఎంపిక చేసింది.
BCCI | న్యూఢిల్లీ: దేశవాళీలపై ఆసక్తి కనబర్చని యువ ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. రంజీ ట్రోఫీలో భాగస్వాములు కాని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు ఈ ఏడాది వార్షిక కాంట్రాక్ట్‌లో చోటు కల్పించలేదు. 2023-24 సీజన్‌కు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌లను బోర్డు బుధవారం ప్రకటించింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే.. దేశవాళీ టోర్నీల్లో తప్పక పాల్గొనాల్సిందే అని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పగా.. ఆ మాట పెడచెవిన పెట్టిన ఇషాన్, అయ్యర్‌ను ఈ ఏడాది కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది.
తాజా వార్షిక కాంట్రాక్ట్‌లో టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, గిల్, సిరాజ్ కొత్తగా ఏ గ్రేడ్‌కు పదోన్నతి పొదారు. వీరితో పాటు అశ్విన్, షమీ, హార్దిక్ పాండ్యా కూడా గ్రేడ్-ఏలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్ గ్రేడ్-బిలో చోటు దక్కించుకోగా.. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్, అక్షర్ పటేల్, యశస్వి అందులో ఉన్నారు.
హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ (గ్రేడ్-సి) దక్కింది. ఈ కాంట్రాక్ట్ నిరుడు అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అమలులో ఉంటుంది. సీనియర్ ఆటగాళ్లు పుజారా, ధవన్, ఉమేశ్, చాహల్, రహానేకు కాంట్రాక్ట్‌లో చోటు దక్కలేదు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు, 10 టీ20లు ఆడితే వారికి గ్రేడ్-సిలో చోటు దక్కనుంది. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడిన సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్ చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగితే.. ఈ ఇద్దరికీ సి గ్రేడ్ వర్తించనుంది.
వార్షిక కాంట్రాక్టులు ఇవే
గ్రేడ్ ఏ ప్లస్: రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా
గ్రేడ్ ఏ: అశ్విన్, షమీ, సిరాజ్, రాహుల్, గిల్, హార్దిక్
గ్రేడ్ బి: సూర్యకుమార్, పంత్, కుల్దీప్, అక్షర్, యశస్వి
గ్రేడ్ సి: రింకూ సింగ్, తిలక్‌వర్మ, రుతురాజ్, శార్దూల్, శివమ్, రవి బిష్ణోయ్, జితేశ్, సుందర్, ముఖేశ్, సంజూ, అర్ష్‌దీప్, భరత్, ప్రసిద్ధ్అవేశ్, రజత్.