బీజేపీకి అగ్నిపరీక్ష.. కాంగ్రెస్‌కు అస్తిత్వపరీక్ష
ఇటీవల ఒక పెండ్లి వేడుకలో తమిళనాడు సీఎం విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక్కచోట చేరి పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని ముచ్చటించారు.
దేశ రాజకీయాల్లో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రానున్న ఎన్నికల గండాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి. వివిధ ప్రాంతీయ రాజకీయ శక్తులు ఒకవైపు, కొత్తగా పుట్టుకొస్తున్న యువజనోద్యమాలు మరోవైపు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నానాటికీ మారుతున్న దేశ రాజకీయ గుణాత్మక పరిణామాలు ఆ రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దశాబ్దాలపాటు కేంద్రం, వివిధ రాష్ర్టాల్లో అధికారం చెలాయించిన ఆ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేసే ధైర్యాన్ని ఏనాడో కోల్పోయాయి.
వర్తమాన రాజకీయాల్లో సన్నగిల్లిపోతున్న మోదీ ప్రతిష్ట, అధికార పీఠానికి దరిదాపుల్లోకి కూడా రాలేని రాహుల్ దీనస్థితి ఆ పార్టీల మిత్రపక్షాలను సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెసేతర సంకీర్ణ రాజకీయశక్తి ఒకటి దేశ రాజకీయాలను శాసించే రోజులు రాబోతున్నాయని ప్రస్తుత పరిణామాలు సంకేతాలను అందిస్తున్నాయి.
ఉచితానుచితం
ఇటీవల ఒక పెండ్లి వేడుకలో తమిళనాడు సీఎం విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక్కచోట చేరి పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని ముచ్చటించారు. ఈ దృశ్యాలను యావత్తు దేశం ఆసక్తిగా గమనించింది. సహజంగానే రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. అందుకు కారణం లేకపోలేదు. ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు సారూప్యం ఉన్నది.
టీవీకే, వైసీపీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలైనప్పటికీ ఏ పొత్తులు లేకుండానే ఒంటరిగానే అధికారంలోకి వచ్చాయి. ఎన్నికల పొత్తు కోసం బీజేపీ, కాంగ్రెస్ వివిధ సందర్భాల్లో సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించినా అవి లొంగిపోలేదు. దక్షిణ భారత అస్తిత్వ ఆత్మగౌరవ శక్తులకు మాత్రం ఆ ముగ్గురి యాదృచ్ఛిక సమావేశం ఒక ఆశాకిరణంగా తోచింది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం అలజడి చెలరేగింది. మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న ప్రజల మనోగతం మరోసారి చర్చల్లోకి వచ్చింది.
1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ భారీ ఆధిక్యత సాధించింది. ఆ తర్వాత 30 ఏండ్లపాటు ఏ పార్టీ మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినా సొంతంగానే మెజారిటీకి అవసరమైన స్థానాలను కైవసం చేసుకున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన బలాన్ని మరింత మెరుగుపరచుకున్నది.
మిత్రపక్షాలపై ఆధారపడే అవసరం లేని ఆధిక్యంతో మోదీ తొలి, మలి ప్రభుత్వాలు కొనసాగాయి. కానీ 2023 ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. పూర్తి మెజారిటీకి 22 సీట్ల దూరంలో ఆగిపోయింది. బీజేపీకి జవసత్వాలు అందించిన అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయినప్పటికీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ ధాటికి యూపీలో వెనుకబడిపోయింది. 2019 తో పోల్చుకుంటే బీజేపీ 29 సీట్లు కోల్పోయింది.
ప్రధాని మోదీ 12 ఏండ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా గత లోక్‌సభ ఎన్నికల్లో చతికిల పడటం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యచకితులను చేసింది. దేశవ్యాప్తంగా 63 సీట్లు కోల్పోయి 543 సీట్లున్న లోక్‌సభలో 240కే పరిమితమై, సొంత బలం తగ్గిన బీజేపీ విధి లేని పరిస్థితుల్లో మిత్రపక్షాల మద్దతుతో నెట్టుకొస్తున్నది. ఇక మిత్రపక్షాల అండదండలు ఉండి కూడా కాంగ్రెస్ ఎంత గింజుకున్నా లోక్‌సభలో మూడంకెల స్కోరును చేరలేకపోతున్నది.
ఇటీవలే అధికారంలోకి వచ్చిన కేరళం మినహాయిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. స్నేహ ధర్మాన్ని విస్మరించిన ఫలితంగా చిరకాల మిత్రపక్షం డీఎంకే కాంగ్రెస్‌కు దూరమైంది. అఖిలేశ్ యాదవ్ తన దారి తాను చూసుకున్నారు. నానాటికీ కాంగ్రెస్ ఒంటరి అవుతుండగా అటు బీజేపీ మిత్రపక్షాల మధ్య వైరుధ్యాలు పెరిగిపోతున్నాయి.
కొత్తగా తెరపైకి వచ్చిన సీజేపీ, యువజనోద్యమాల ధాటికి తలొగ్గిన మోదీ ఏకంగా కేంద్ర క్యాబినెట్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాల్సి వచ్చింది. రెండేండ్లుగా బీజేపీని అభద్రతాభావం వెంటాడుతున్నది. ఇటీవల యూపీలో శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో రెండింటిలోనూ బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ పోటీలోనే లేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అందునా, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో గత లోక్‌సభ ఎన్నికల నుంచి ఆ పార్టీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి.
రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి ఆమడదూరంలో ఉన్నది. యూపీ నుంచే ఎదిగివచ్చిన దివంగత కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రాజకీయ వారసత్వాన్ని నిలుపుకోవడంలో రాహుల్ గాంధీ ఘోరంగా విఫలమవుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలను, ఇటీవలి శాసనమండలి ఎన్నికలను బేరీజు వేసుకుంటే త్వరలో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
అదే సమయంలో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయినా అందరి దృష్టి యూపీ మీదనే ఉన్నది. కేంద్ర అధికార పీఠాన్ని అందుకోవడానికి ప్రధాన నిర్ణాయక రాష్ట్రంగా 80 లోక్‌సభ సీట్లున్న యూపీలో ఉభయ జాతీయ పార్టీలు తమ ఉనికి, ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రపంచ పరిణామాలు మారుతున్నాయి. యుద్ధ పిపాసులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇటీవల ఎన్నికల్లో ఆయా దేశాల ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. మితిమీరిన మతవాదం ఎల్లకాలం మనుగడ సాగించలేవని షరియా చట్టాలు అమల్లో ఉన్న ఇస్లామిక్ దేశాల అంతర్గత సంక్షోభాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేరుకుపోతున్న మోదీ పరివారం సామాజిక సంక్షోభాలు, ప్రజా సమస్యలను పక్కనపెట్టి పొరుగు దేశాలతో యుద్ధభయాలను ప్రజల ముందు ఉంచడం ఇంకా పనిచేయకపోవచ్చు.
మతం జపం పనిచేసేది, ప్రభావం చూపేది కొంతకాలమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం కొలువైన నాగపూర్, రామాలయ నిర్మాణం జరిగిన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అందుకు తార్కాణం. మరోవైపు సవాలక్ష సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పరివారం యావత్తు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వెంటపడడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. పైగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు అవినీతి, ఆశ్రితపక్షపాతంలో పీకల దాకా మునిగిపోయారు. అందుకు తెలంగాణనే సాక్ష్యం. నేల విడిచి సాము చేస్తున్న కాంగ్రెస్ ఉద్యమాల్లో ప్రజలు మమేకం కావడం లేదు.
దేశం యావత్తు ఏకకాలంలో అటు బీజేపీతో విసిగిపోయింది. ఇటు కాంగ్రెస్‌కు దూరమైంది. చెట్టు ఉనికిని నీడ ప్రశ్నించినట్టు ‘మేం లేకుంటే మీకు బతుకు లేదు’ అనే ధోరణిలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ రెండు పార్టీల సొంత బలమెంతో ఆయా మిత్రపక్షాలకు క్రమక్రమంగా అవగతమవుతున్నది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ సాంకేతికంగా ఎన్నికల కమిషన్ రికార్డుల్లో జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్న ఇతర పార్టీలు దేశాన్ని ప్రభావితం చేసే స్థితిలో లేవు.
వచ్చే ఏడాది నుంచి అధికార బీజేపీ అగ్నిపరీక్షలు ఎదుర్కోబోతున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ గత వైభవ అస్తిత్వం కోసం పాకులాడుతున్నది. 25 ఏండ్లుగా ఆ రెండు పార్టీల పాలనలో ఆశలు ఈడేరక విసిగిపోయిన దేశ ప్రజలు మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో దేశ రాజకీయాల్లో అభివృద్ధి పథాన్ని ఆశావహ దృక్పథాన్ని అందించే నాయకత్వం కావాలి. అందుకు ప్రాంతీయ పార్టీలే ముందుకు రావాలి.
-డాక్టర్ అయాచితం శ్రీధర్ . 98498 93238
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

