Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రితికా దంపతులకు ఇటీవల తనయుడు జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రోహిత్ దంపతులు తనయుడి పేరును గానీ, ఫొటోనుగానీ అభిమానులతో పంచుకోలేదు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ అభిమానులంతా ఏం పేరు పెట్టారు? అని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రితికా తనయుడి పేరును సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది. రోహిత్ – రితికా జంట తనయుడికి ‘అహాన్’ అని పేరు పెట్టినట్లు ఇన్‌స్టా స్టోరీలో రితికా పేర్కొంది. క్రిస్మస్ నెల ప్రారంభమైన నేపథ్యంలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ పేర్కొంది. ఫొటోలో నాలుగు శాంటాక్లాజ్‌లు ఉండడం విశేషం. ప్రస్తుతం రోహిత్ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు.
ఇప్పటికీ ఈ జంటకు తనయ సమైరా ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తనయుడి పేరును రివీల్ చేసిన రితికా.. ఎక్కడ ఆ పేరును పెట్టినట్లు చెప్పకుండా.. శాంటాలకు పేర్లు రాసి షేర్ చేయడం విశేషం. శాంటాలకు రో, రిట్స్, సమ్మి, అహాన్ పేరు రాసి ఉన్న ఫొటోను షేర్ చేయడం అభిమానులను ఆకట్టుకున్నది. ఇక అహాన్ పేరుకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు పలువురు అభిమానులు ప్రయత్నించారు. అహాన్ అనే పేరుకు అర్థాలు చాలానే ఉన్నాయి. సూర్యోదయం, ఆశాకిరణం, ఆరంభం అనే అర్థనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. అక్కడ ఐదు టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్నది. ఇప్పటికే 1-0తో ఆధిక్యలో ఉన్నది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ లెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నది.
రోహిత్ మిడిలార్డర్లో దిగి.. మూడు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక రెండురోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. సామ్ కోన్స్టాస్ (107) రాణించాడు. హన్నో జాకబ్స్ (61) అర్ధ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు, ఆకాశ్ దీప్ 2, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం 37 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇంకా లక్ష్యానికి 33 పరుగుల దూరంలో ఉన్నది.