Dinesh Karthik | సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో సభ్యుడైన దినేశ్ కార్తీక్ ప్రస్తుతం కామెంటేటర్ అవతారం ఎత్తి వన్డే ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ఒక చిక్కు ప్రశ్న ఎదురు కాగా.. దానికి తనదైన శైలిలో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. మెగాటోర్నీలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం పుణే వేదికగా కీలక పోరు జరగనుండగా.. ఈ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరి బ్యాటింగ్ మీకు బాగా ఇష్టం అనే ప్రశ్న కార్తీక్‌కు ఎదురైంది.
దీనిపై స్పందిస్తూ.. ‘చంపేస్తావే ఏంటీ (మర్వావోగే క్యా). వాళ్లిద్దరూ నా స్నేహితులే’ అని దినేశ్ కార్తీక్ సమాధానమిచ్చాడు. ఒకవేళ రోహిత్, కోహ్లీలో ఎవరి బ్యాటింగ్ ఇష్టమో చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడితే.. అప్పుడు మాత్రం టాస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నాడు. అదేంటి బ్యాటింగ్‌కు టాస్‌తో సంబంధం ఏంటీ అని అనుకుంటున్నారు. మరి కార్తీక్ రిప్లై ఇచ్చిన తీరు దీనికి ముడి పడి ఉన్నదే!
‘భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ హిట్టింగ్ చూడటాన్ని ఇష్టపడతా.. అదే గనక టీమ్ఇండియా రెండో బ్యాటింగ్ చేస్తుంటే మాత్రం రన్ మెషీన్, చేజ్ మస్టర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆస్వాదిస్తా’ అని తన అభిప్రాయం వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘కార్తీక్ బాగా తెలివిగా సమాధానం ఇచ్చాడు’ అని ఒకరు కామెంట్ చేస్తే.. అందులో తప్పేముంది నిజమేగా చెప్పాడు మరొకరు అభిప్రాయపడ్డారు.