న్యూఢిల్లీ : భారత క్రికెట్లో అలజడి! స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మ..టెస్టు కెరీర్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికాడు. గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వార్తలకు చెక్ పెడుతూ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు హిట్‌మ్యాన్ బుధవారం ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు. టెస్టుల్లో గత కొన్ని నెలలుగా నిలకడలేమితో సతమతమవుతున్న రోహిత్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘హలో అందరికి. టెస్టులకు వీడ్కోలు పలుకుతున్న విషయం మీకు చెప్పదల్చుకున్నాను. టెస్టుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
ఇన్నేండ్లుగా మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. వన్డేలో భారత్ తరఫున కొనసాగుతాను’ అని తన టెస్టు క్యాప్‌తో ఫొటో పోస్ట్ చేశాడు. తన టెస్టు కెరీర్లో 67 మ్యాచ్‌లాడిన రోహిత్ 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. 212 పరుగులు హిట్‌మ్యాన్‌కు అత్యధిక స్కోరు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కొత్త కెప్టెన్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు పగ్గాలు అప్పగిస్తారా..లేక బుమ్రాను నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. రోహిత్ వీడ్కోలుతో టీమ్ఇండియా ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు కొనసాగనున్నారు. భారత క్రికెట్లో ఇది తొలిసారి కావడం విశేషం.