ముంబై: మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ(Roger Binny).. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితుయ్యాడు. 1983లో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. అయితే ఇవాళ ముంబైలో జరిగిన ఏజీఎంలో .. రోజర్ బిన్నీ పేరును ప్రకటించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో ఇప్పుడు రోజర్ బిన్నీ ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారు. బీసీసీఐ సెక్రటరీగా జే షా కొనసాగనున్నారు.
రోజర్ బిన్నీ వయసు 67 ఏళ్లు. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఆఫీసు బేరర్ల ఎన్నిక కూడా లాంఛనం కానున్నది.
బిన్నీ ఇప్పటి వరకు కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు ఆ పదవిని ఆయన వదిలేయనున్నారు. మీడియం పేసర్ అయిన బిన్నీ.. కపిల్ బృందంలో ఆల్‌రౌండర్ పాత్రను పోషించారు. 1983లో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో కీలక బౌలర్‌గా రాణించారు. ఆ టోర్నీలో అతను 18 వికెట్లు తీసుకున్నాడు.
సీనియర్ సెలక్షన్ కమిటీలో బిన్నీ సభ్యుడిగా చేశారు. ఆ సమయంలో సందీప్ పాటిల్ చైర్మెన్‌గా ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీకి ఉన్నా.. ఆయనకు రెండవ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ చైర్మెన్‌గా ఉండేందుకు సౌరవ్‌కు అవకాశం ఇచ్చినా.. ఆయన దాన్ని వ్యతిరేకించినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా వెల్లడైంది. కానీ ఐసీసీ చైర్మెన్‌గా గంగూలీ పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.