లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడవ రోజు రిషబ్ పంత్(Rishabh Pant) అంపైర్లతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకున్నది. అంపైర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన కారణంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి అతన్ని మందలించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగిన పంత్.. ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో సరైన రీతిలో ప్రవర్తించలేదని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ పేర్కొన్నది. అంతర్జాతీయ మ్యాచుల్లో అంపైర్ల పట్ల సరైన ప్రవర్తన కలిగి ఉండకపోవడాన్ని లెవల్ 1 అఫెన్స్‌గా చూస్తారు. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘించినట్లు ఐసీసీ చెప్పింది. క్రమశిక్షణా చర్యల కింద పంత్‌కు ఓ డీమెరిట్ పాయింట్ జోడించారు. గడిచిన 24 నెలల్లో అతను తొలిసారి క్రమశిక్షణా కోడ్‌ను ఉల్లంఘించాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 61వ ఓవర్లో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బంతి కండీషన్‌పై ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పంత్ చర్చించాడు. బాల్‌ను మార్చేందుకు అంపైర్లు నిరాకరించడంతో రిషబ్ పంత్ ఆగ్రహంతో తన చేతుల్లో ఉన్న బంతిని నేలకు కొట్టేశాడు. తప్పును ఒప్పుకొన్ని పంత్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రచర్డ్సన్ విధించిన ఆంక్షలను ఆమోదించాడు.