Ajit Agarkar | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించినట్లు సమాచారం. ఆయన పదవీకాలాన్ని 2026 జూన్ వరకు పొడిగించినట్లుగా పలు నివేదికలు తెలిపాయి. అయితే, అగార్కర్ నేతృత్వంలో భారత్ జట్టు వరుసగా 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను సాధించింది. దాంతో సెలక్షన్ కమిటీపై బీసీసీఐ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ.. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను పొడిగించినట్లుగా పలు నివేదికలు తెలిపాయి. ‘అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, జట్టులో విజయవంతమైన మార్పులు తీసుకురావడంలో సఫలమైంది. అగార్కర్ తన పదవీకాలంలో భారత జట్టును ఒక్కటి కాదు.. రెండు ప్రతిష్ఠాత్మక టైటిళ్లను గెలిపించడమే కాకుండా, టెస్టులు, టీ20 జట్లలో మార్పులను ప్రవేశపెట్టాడు’ అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. దాంతో ఈ నిర్ణయం, అగార్కర్ తన కాంట్రాక్ట్ పొడిగింపును కొన్ని నెలల క్రితమే అంగీకరించడంతో మరింత స్పష్టమైంది.
ప్రస్తుత సెలక్షన్ ప్యానెల్లో ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ సభ్యులుగా ఉన్నారు. సెప్టెంబర్‌లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కమిటీలో మార్పులను చేసే అవకాశం ఉందని సమాచారం. శరత్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని.. దాస్, బెనర్జీ స్థానాల విషయంలో సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది. సమావేశం తర్వాత బోర్డు సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలుస్తున్నది. సీనియర్ మహిళా, జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీల్లోనూ మార్పులు చేయనున్నట్లు తెలుస్తున్నది. నీతు డేవిడ్, ఆరతి వైద్య, మిథు ముఖర్జీలతో కూడిన మహిళా ప్యానెల్ ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం. ఐదేళ్లు గరిష్ట పదవీకాలం. రాబోయే వారాల్లో కొత్త సభ్యుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నది.
ఇదిలా ఉండగా.. ఆటగాళ్ల పనిభారం నిర్వహణ విషయంలో, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో సెలక్షన్ కమిటీ అనుసరిస్తున్న విధానంపై అగార్కర్ మాట్లాడారు. బుమ్రా ఫిట్నెస్ గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. అధికారిక పనిభారం ప్రణాళిక లేదని, అయితే జట్టు నిర్వహణ, వైద్య సిబ్బంది మధ్య సమన్వయం ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. ‘సహజంగానే, ఇంగ్లండ్ సిరీస్ తర్వాత కూడా విరామం దొరికింది. జట్టు నిర్వహణ, ఫిజియోలు, సంబంధిత వ్యక్తులు ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఇప్పుడే కాదు. గాయానికి ముందు కూడా అతను (బుమ్రా) ఎంత విలువైనవాడో మాకు తెలుసు కాబట్టి అతన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించాం’ అని అగార్కర్ అన్నారు. అగార్కర్ పదవీకాలం పొడిగించడం భారత క్రికెట్‌కు కీలకం కానున్నది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, 2027లో వన్డే ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేయాల్సి రానున్నది.