నేవి ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. లీగ్‌లో శుక్రవారం జరిగిన పోరులో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించింది. తద్వారా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుని టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తున్న ఆర్సీబీ మరోమారు సమష్టి ప్రదర్శనతో సత్తాచాటింది.
మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి, రెండు గెలిచిన గుజరాత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలోఉంది. ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్…యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్(5/23) ధాటికి 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్‌ను ఇయాన్ బెల్(3/29) పనిపడితే, మిగతా పనిని పాటిల్ పూర్తి చేసింది. వీరిద్దరి విజృంభణతో గుజరాత్ జట్టులో భారతి(39) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. సోఫీ డివైన్(8), కెప్టెన్ ఆశ్లే గార్డ్నర్(3) స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్ దాడికి గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.
క్రీజులో భారతి ఉన్నంతసేపు జెయింట్స్ గెలుపుపై ఆశలు చెలరేగినా..సరైన సహకారం కరువైంది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ పాటిల్ స్పిన్ తంత్రంతో గుజరాత్ ఇన్నింగ్స్‌ను కకావికలు చేసింది. వైవిధ్యమైన స్పిన్‌తో శ్రేయాంక వికెట్ల వేట కొనసాగించింది. తొలుత రాధాయాదవ్(66) అర్ధసెంచరీకి తోడు రిచా ఘోష్(44) రాణించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 182/7 స్కోరు చేసింది. టాపార్డర్ విఫలమైనా రాధా యాదవ్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. సోఫీ డివైన్(3/31) మూడు వికెట్లు తీసింది. రాధా యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.