RCB Director : తొక్కిసలాట.. ఆపై పోలీసు కేసుతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికే మహారాజా టీ20 లీగ్ ఆతిథ్యాన్ని కోల్పోయిన చిన్నస్వామి మైదానం నుంచి మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌లు తరలిపోయాయి. ఓవైపు చిన్నస్వామి స్టేడియం ప్రతిష్ట దిగజారుతుండగా.. మరోవైపు ఆర్సీబీకి చెడ్డ పేరు వస్తున్న ఈ సమయంలో ఆర్సీబీ డైరెక్టర్ మో బొబత్ (Mo Bobat) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తొక్కిసలాటలో మృతి చెందిన వాళ్లను తమ వారసత్వంగా పరిగణిస్తామని.. వాళ్లను, వాళ్ల కుటుంబాన్ని ప్రత్యేకంగా గౌరవిస్తామని తెలిపాడు బొబత్. తొక్కిసలాటలో మరణించిన పదకొండుమందికి ప్రత్యేక గౌరవం కల్పించాలని శుక్రవారం ఆర్సీబీ యాజమాన్యాన్ని కోరాడు. తమ జట్టు విజయంతో కోసం నిరీక్షించి.. తీరా విక్టరీ పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చి మృత్యుఒడికి చేరిన వారిని తమలో ఒకరికి గుర్తిస్తున్నట్టు చెప్పాడు బొబత్.
🚨 𝐂𝐑𝐈𝐂𝐁𝐔𝐙𝐙 𝐄𝐗𝐂𝐋𝐔𝐒𝐈𝐕𝐄 🚨
RCB’s first title was meant to be pure celebration. Instead, it all turned tragic as 11 fans lost their lives in a stampede.
Mo Bobat says those fans will forever be part of RCB’s history #RCB #IPL2025 pic.twitter.com/4GTiV4XiAZ
— Cricbuzz (@cricbuzz) August 22, 2025
‘క్రికెట్, ఐపీఎల్ మ్యాచ్‌లు ఎంతో థ్రిల్ పంచుతాయి. మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే అభిమానులు మాకు అతిపెద్ద ఆస్తి. బెంగళూరు ఫ్రాంచైజీ ఐపీఎల్ కప్ గెలుపొందాలని వీళ్లందరూ 18 ఏళ్లుగా ఎదురుచూశారు. వాళ్లందరి కోసం మా జట్టు ట్రోఫీ సాధించింది. కానీ, దురదృష్టవశాత్తూ.. తొక్కిసలాటలో 11 మంది మరణించడం బాధాకరం. ఆ పదకొండు మందిని.. వాళ్ల కుటుంబాలను మేము గుర్తిస్తాం. ఆర్సీబీకి వీరాభిమానులైన వారి జీవితాన్ని మా ఫ్రాంచైజీ చరిత్రలో భాగం చేస్తాం. ప్రతి జట్టుకు ఒక స్టోరీ.. వారసత్వం ఉంటుంది. అలానే మాకూ ఈ అభిమానులతో ముడిపడిన స్టోరీ ఉంది. అందుకే వీళ్లను గౌరవించాలనుకుంటున్నాం’ అని బొబాత్ తెలిపాడు.
ఐపీఎల్లో అశేష అభిమానగణం కలిగిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru). పద్దెనిమిదో సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు ఫ్రాంచైజీ కోట్లాదిమంది కలల్ని నిజం చేస్తూ కప్‌ను అందుకుంది. కానీ, ఆ సంతోషాన్ని చిన్నస్వామి తొక్కిసలాట అందరి ముఖాల నుంచి మాయం చేసింది. భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదం పదకొండు మందిని బలిగొంది. అప్పటి నుంచి ఈ మైదానంలో క్రికెట్ ఆటకు ఫుల్స్టాప్ పడింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.