పాకిస్తాన్ మాజీ పేసర్, క్రికెట్ అభిమానులంతా ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అని పిలుచుకునే షోయభ్ అక్తర్ జీవితం వెండితెరకెక్కనున్నది. తనదైన వేగం, రయ్యిమని దూసుకొచ్చే యార్కర్లు, ఒంటికి తాకే బౌన్సర్లతో గత తరం బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన ఈ దిగ్గజ పేసర్.. తన బయోపిక్‌ను ప్రకటించాడు. తన ప్రయాణాన్ని వెండితెరపై చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
తాజాగా అక్తర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ఈ అందమైన ప్రయాణం ప్రారంభం.. నా కథ, నా జీవితం, నా బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్. మీరు ఇంతకుముందెన్నడూ చేయని రైడ్‌లో ఉన్నారు. పాకిస్తానీ క్రీడాకారుడి గురించిన మొదటి విదేశీ చిత్రం. వివాదాస్పదంగా అది మీదే, షోయభ్ అక్తర్’ అని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు.
అభిమానులు తనను ఇష్టంగా పిలచుకునే పేరునే అక్తర్ తన సినిమాకు టైటిల్‌గా వాడుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ అక్తర్ పై విధంగా స్పందించాడు. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనేది టైటిల్ కాగా ‘రన్నింగ్ అగేనెస్ట్ ది ఆడ్స్’ (అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం) అనేది ట్యాగ్‌లైన్. ఈ బయోపిక్కు మహ్మద్ ఫరాజ్ ఖైజర్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమాను 2023 నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అక్తర్ ఈ మోషన్ పోస్టర్లో వెల్లడించాడు.
ఇక 1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 2011 వరకు పాకిస్తాన్ తరఫున ఆడాడు. తన సుదీర్ఘ కెరీర్లో అక్తర్ 46 టెస్టులు ఆడి 178 వికెట్లు తీయగా.. 163 వన్డేలలో 247 వికెట్లు పడగొట్టాడు. 15 టీ20లలో 19 వికెట్లు తీశాడు. 2003లో న్యూజిలాండ్ వేదికగా అతడు విసిరిన అత్యధిక వేగవంతమైన డెలివరీ (గంటకు 161 కిలోమీటర్లు) ఇప్పటికీ తన పేరుమీదే ఉంది.