హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (టీబీఏ) అధ్యక్షుడిగా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి జస్టిస్ నవీన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో రావుల గెలుపొందారు. గతంలో టీబీఏకు చైర్మన్‌గా పనిచేసిన ఆయన అధ్యక్ష పదవిలో 2029 దాకా కొనసాగనున్నారు. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా రావుల విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా చంద్రమోహన్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, విజయసారథి ఎన్నికవగా జనరల్ సెక్రటరీగా పృథ్వీశ్వర రెడ్డి, ఉమ్మడి కార్యదర్శులుగా విష్ణుకుమార్, మహ్మద్ సమీయుద్దీన్, అసోసియేట్ సెక్రటరీలుగా సుకుమార్, నస్రుల్లా హైదర్, ట్రెజరర్‌గా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా శాట్ నుంచి డీడీ రవీందర్, తెలంగాణ ఒలింపిక్ సంఘం నుంచి ఖాజా హాజరయ్యారు.