Rashid Khan : బంతి అందుకున్నాడంటే బ్యాటర్లను ఇరుకునపెట్టే రషీద్ ఖాన్ (Rashid Khan)లాంటి స్పిన్నర్ తమ జట్టులో ఉండాలని ప్రతి దేశం కోరుకుంటుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఈ స్పిన్ మాంత్రికుడిని తమ దేశంలో స్థిరపడాలని భారత్, ఆస్ట్రేలియా నుంచి పౌరసత్వం (Citizenship) ఆఫర్లు కూడా వచ్చాయట. కానీ, తానే సున్నితంగా తిరస్కరించానని చెబుతున్నాడీ అఫ్గనిస్థాన్ మాజీ కెప్టెన్. త్వరలో రాబోతున్న తన స్వీయ పుస్తకంలో రషీద్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
అనామక జట్టైన అఫ్గనిస్థాన్ పెద్ద జట్లకు షాకిస్తుందంటే రషీద్ ఖాన్ వంటి మేటి స్పిన్నర్ ఆ టీమ్‌లో ఉండడం ఓ కారణం. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్లో రాణిస్తున్న రషీద్.. తన క్రికెట్ ప్రయాణం గురించి పుస్తకం తీసుకొస్తున్నాడు. ‘Rasheed Khan : From Steets to Stardom’ అనే పుస్తకంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ అఫ్గన్ స్టార్. ‘నాకు పౌరసత్వం ఇస్తామని పలు దేశాలు ఆసక్తి చూపించాయి. భారత్, ఆస్ట్రేలియా నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి. అయితే.. నేను సున్నితంగా తిరస్కరించాను. నా మాతృ దేశానికి ఆడకుంటే.. నేను ఏ దేశానికి ఆడను అని తేల్చి చెప్పేశాను’ అని రషీద్ తెలిపాడు. ఇంతకూ తనకు ఇండియా నుంచి ఆఫర్ ఎప్పుడు వచ్చిందో కూడా వివరించాడీ స్టార్ స్పిన్నర్.
Rashid Khan turned down citizenship offer from India: I will play for Afghanistan
Read More: https://t.co/eAkdk0o7FI pic.twitter.com/7ct9zdgreY
— IndiaToday (@IndiaToday) April 19, 2026
”ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటన్స్ అధికారి ఒకరు ‘భారత క్రికెట్ బోర్డు అత్యున్నత అధికారి ఒకరు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు’ అని నాతో చెప్పాడు. ‘మీ దేశంలో పరిస్థితులు ఏమీ బాగా లేవు. భారత్‌కు వచ్చి స్థిరపడు. నీకు భారత పౌరుడిగా అవసరమైన పత్రాలు ఇస్తాం. ఇక్కడే జీవించు. ఇక్కడే క్రికెట్ ఆడు’ అని ఆ అధికారి నాతో అన్నాడు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయాను. ఆయనకు ఏమని బదులివ్వాలో తోచలేదు. చిన్నగా నవ్వి.. మీకు చాలా కృతజ్ఞతలు. నేను నా దేశం అఫ్గనిస్థాన్‌కు ఆడుతున్నాను. నా మాతృదేశానికి ఆడకుంటే.. ప్రపంచంలోనే ఏ దేశం తరఫున నేను ఆడను అని చెప్పాను” అని రషీద్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.

ఐపీఎల్లో విజయవంతమైన రషీద్ ఖాన్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు ఆడిన రషీద్ భారతీయుల మనసు దోచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 10 బంతుల్లో 34 పరుగులతో చెలరేగిన ఈ అఫ్గన్ ఆటగాడికి భారత పౌరసత్వం ఇవ్వాలని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అంతేనా.. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(Sushma Swaraj)ను ట్యాగ్ చేస్తూ రషీద్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరారు చాలామంది.

అయితే.. అందుకు సుష్మ పౌరసత్వం అంశం తన పరిధిలోకి రాదని, కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం తెలిసిన అప్పటి అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రతిభావంతుడు, తమ క్రికెట్ ఆస్తి అయిన రషీద్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని కుండబద్ధలు కొట్టారు. తనపై అంతులేని నమ్మకం, అభిమానం చూపించిన ప్రెసిడెంట్‌కు నేను మాతృ దేశానికే ఆడుతానని రషీద్ మాటిచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మేటి స్పిన్నర్‌గా ఎదిగిన రషీద్ ఖాన్ బాల్యం మురికి వీధుల్లో గడిచింది. అఫ్గనిస్థాన్‌లోని నంగర్హర్లో జన్మించిన రషీద్.. దుమ్మూధూళితో నిండిన వీధులు, అరకొర వసతులున్న వాతావరణంలో పెరిగాడు. అయితే.. క్రికెట్‌పై అతడికున్న పిచ్చి ప్రేమే జీవితాన్ని మార్చేసింది. అండర్-19 క్రికెట్లో అదరగొట్టి.. మిస్టరీ స్పిన్నర్‌గా వెలుగులోకి వచ్చిన రషీద్ అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు.

ముఖ్యంగా టీ20ల్లో సంచలన బౌలింగ్‌తో దిగ్గజ ఆటగాళ్లను భయపెట్టిన ఈ లెగ్ స్పిన్నర్ 2020లో ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు గెలుచుకున్నాడు. అఫ్గనిస్థాన్ తరఫున ఇప్పటివరకూ టెస్టుల్లో 45 వికెట్లు, వన్డేల్లో 210.. టీ20ల్లో 193 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్, అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో మొత్తంగా 700లకు పైగా వికెట్లు తీశాడీ లెజెండరీ బౌలర్.