మహాబలిపురం: భారత సర్ఫింగ్ క్రీడలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ యువ సర్ఫర్ రమేశ్ బుదిహాల్ సంచలనం సృష్టించాడు. మహాబలిపురం (తమిళనాడు)లో జరిగిన ఏషియన్ సర్ఫింగ్ చాంపియన్షిప్స్ -2025లో రమేశ్ కాంస్యం సాధించి సత్తాచాటాడు. ఈ ఈవెంట్లో భారత్ తరఫున ఇదే తొలి పతకం కావడం విశేషం. శనివారం జరిగిన పోటీల్లో ఫైనల్ చేరి ఆ రికార్డు సాధించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన అతడు.. తుది పోరులో ఏకంగా పతకం సాధించి అందర్నీ ఆనందంలో ముంచెత్తాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నలుగురు సర్ఫర్లు హోరాహోరీగా తలపడగా రమేశ్.. 12.60 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. కొరియా సర్ఫర్ కనోవ హీజా (15.17 పాయింట్లు) అగ్రస్థానంతో స్వర్ణాన్ని గెలుచుకోగా పజర్ అరియానా (ఇండోనేషియా.. 14.57 పాయింట్లు) రజతం గెలిచాడు.
ఇండోనేషియాకే చెందిన మెగా అర్టానా (9.97) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దూసుకొస్తున్న నీటి అలలపై తనదైన విన్యాసాలతో చెలరేగిన బుదిహాల్.. ఆరంభంలోనే 6.17 పాయింట్లు స్కోరు చేసి ఫస్ట్ వేవ్స్ ముగిసేటప్పటికీ రెండో స్థానంలో ఉన్నాడు. కానీ కనోవ, పజర్ తర్వాత పుంజుకుని తొలి రెండు స్థానాల్లోకి దూసుకొచ్చారు. పతకం గెలవాలంటే తప్పక సత్తాచాటాల్సిన ‘డైయింగ్ మూమెంట్స్’లో 6.43 పాయింట్లు స్కోరు చేసిన రమేశ్.. మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పతకం గెలిచిన అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘ఇది మా అందరికీ గర్వకారణం. నేను మా జట్టు, దేశం కోసం నా శక్తిమేర ప్రయత్నించాను. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి మాకు మద్దతుగా నిలిచినవారందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపాడు.