218 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 178/4తో నిలిచింది! అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు! 4 ఓవర్లలో 40 పరుగులు చేస్తే నైట్ రైడర్స్ విజయం సాధిస్తుందనగా.. బంతినందుకున్న రాజస్థాన్ స్పిన్నర్ చాహల్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టి కోల్‌కతా నడ్డి విరిచాడు! అంతకుముందు బట్లర్ వీర బాదుడుతో సీజన్లో రెండో సెంచరీ తన పేరిట రాసుకోవడంతో భారీ స్కోరు చేసిన రాజస్థాన్.. చాహల్ మెరుపు ఓవర్‌తో లీగ్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది!
ముంబై: పరుగుల వరద పారిన పోరులో రాజస్థాన్‌దే పైచేయి అయింది. 427 పరుగులు నమోదైన మ్యాచ్‌లో ఓ సెంచరీ.. ఓ ఐదు వికెట్ల ప్రదర్శన.. ఓ అద్భుత రనౌట్.. ఇలా క్రికెట్ అభిమానులకు కవాల్సిన అన్ని మసాలాలు మేళవించిన ఫుల్‌మీల్స్ దక్కింది. సోమవారం ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (61 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ సీజన్లో రెండో సెంచరీతో అదరగొడితే.. కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (24) తలాకొన్ని పరుగులు చేశారు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాదుడే పనిగా పెట్టుకున్న బట్లర్ దూకుడు చూస్తుంటే.. రాజస్థాన్ మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా.. ఆఖర్లో కోల్‌కతా బౌలర్లు రాయల్స్‌ను కట్టడి చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్ (1/50), ఉమేశ్ యాదవ్ (0/44), వరుణ్ చక్రవర్తి (2 ఓవర్లలో 0/30) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 85; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆరోన్ ఫించ్ (28 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో ఒక దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న కోల్‌కతాకు యుజ్వేంద్ర చాహల్ బ్రేకులు వేశాడు. ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. చాహల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం లక్నోతో బెంగళూరు తలపడనుంది.
శ్రేయస్, ఫించ్ మెరుపులు వృథా అయ్యర్ అద్భుతః
కొండంత లక్ష్యఛేదనలో కోల్‌కతా అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్ అవతారమెత్తిన నరైన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటైనా.. ఫించ్, శ్రేయస్ దంచికొట్టారు. బౌలర్‌తో సంబంధం లేకుండా వీరిద్దరూ మైదానం నలుమూలలా భారీ షాట్లతో విరుచుకుపడటంతో.. అభిమానులు బౌండ్రీల వర్షంలో తడిసి ముద్దయ్యారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన శ్రేయస్.. ప్రసిద్ధ్‌కు అదే శిక్ష వేశాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన ఫించ్.. యుజ్వేంద్ర చాహల్‌కు హ్యాట్రిక్ ఫోర్లతో స్వాగతం పలికాడు. మెక్కాయ్ ఓవర్లో 4,6 బాదిన ఫించ్ 25 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించిన అనంతరం ఫించ్ ఔటైనా.. శ్రేయస్ జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న శ్రేయస్.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. మధ్యలో నితీశ్ రాణా (18), రస్సెల్ (0) విఫలమైనా.. అయ్యర్ ఆ ప్రభావం పడకుండా చూసుకున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 178/4తో నిలిచింది. విజయానికి 24 బంతుల్లో 40 పరుగులు అవసరం కావడంతో పాటు.. క్రీజులో అయ్యర్స్ జోడీ శ్రేయస్, వెంకటేశ్ జోడీ ఉండటంతో కోల్‌కతా విజయం ఖాయమే అనిపించింది.
బాదుడే బాదుడు..
తాజా సీజన్లో అద్వితీయ ఫామ్ కొనసాగిస్తున్న బట్లర్ తొలి బంతి నుంచి బాదుడే పరమావధిగా రెచ్చిపోయాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 4,6తో ప్రారంభమైన ఊచకోత పెవిలియన్ చేరేవరకు నిర్విరామంగా సాగింది. మరో ఎండ్ నుంచి దేవదత్ పడిక్కల్ అతడికి చక్కటి సహకారం అందించాడు. వరుణ్ చక్రవర్తికి 6,4తో స్వాగతం పలికిన బట్లర్.. శివమ్ మావికి అదే శిక్ష వేశాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. అందులో బట్లర్ చేసినవే 46 రన్స్ ఉండటం విశేషం. ఈ సీజన్లో చక్కటి బౌలింగ్‌తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఉమేశ్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకొని బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో స్పెల్ వేసేందుకు వచ్చిన ఉమేశ్‌కు 4,6 రుచి చూపించిన బట్లర్.. 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించాక పడిక్కల్ ఔటైనా.. కెప్టెన్ సంజూ శాంసన్ అండగా బట్లర్ దూసుకెళ్లాడు. మరోవైపు శాంసన్ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో పరుగుల వరద పారింది. శివమ్ మావి ఓవర్లో రెండు ఫోర్లు అరుసుకున్న శాంసన్.. ఉమేశ్ ఓవర్లో 4,6 కొట్టాడు. మరోవైపు కమిన్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన బట్లర్ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి ధాటికి 15 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ 163/1తో నిలిచింది. దీంతో మరింత భారీ స్కోరు ఖాయమనుకుంటే.. రస్సెల్ ఓ చక్కటి బంతితో శాంసన్‌ను పెవిలియన్ పంపగా.. సెంచరీ పూర్తి కాగానే బట్లర్ కూడా వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 34 బంతుల్లోనే 67 పరుగులు జోడించారు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ హెట్‌మైర్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు దంచడంతో రాజస్థాన్ రెండొందల మార్క్ దాటింది.
మలపుతిప్పిన చాహల్..
నాలుగు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన దశలో బంతినందుకున్న చాహల్.. కోల్‌కతా ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. తొలి బంతికి వెంకటేశ్ అయ్యర్ (6) స్టంపౌట్ కాగా.. నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదో బంతికి శివమ్ మావి (0) భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి కమిన్స్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న చాహల్.. కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (9 బంతుల్లో 21; ఒక ఫోర్, 2 సిక్సర్లు) భారీ షాట్లతో భయపెట్టినా.. మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో కోల్‌కతాకు పరాజయం తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 217/5 (బట్లర్ 103; శాంసన్ 38; నరైన్ 2/21, రస్సెల్ 1/29), కోల్‌కతా: 19.4 ఓవర్లలో 210 ఆలౌట్ (శ్రేయస్ 85, ఫించ్ 58; చాహల్ 5/40).