IND vs AUS : టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia)ను మట్టికరిపించిన భారత జట్టు వన్డే సిరీస్‌లోను జోరు కొనసాగించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఆసీస్‌ను 188 రన్స్‌కే కట్టడి చేసిన టీమిండియా మరో పది ఓవర్లు ఉండగానే మ్యాచ్ ముగించింది. టెస్టు సిరీస్‌లో విఫలమైన (KL Rahul) కేఎల్ రాహుల్ (75) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ఆల్‌రౌండర్ (Ravindra Jadeja)రవీంద్ర జడేజా (45) సహకారం అందించాడు. అజేయంగా నిలిచిన వీళ్లు ఆరో వికెట్‌కు 108 రన్స్ జోడించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ మరొక విజయం నమోదు చేసింది. ఆసీస్‌పై తొలి వన్డేలో భారీ విక్టరీ సాధించింది. టెస్టు సిరీస్‌లో విఫలమై విమర్శల పాలైన కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అతను మరోసారి తన క్లాస్ ఆటతో జట్టును ఆదుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన అతను కెప్టెన్ హార్దిక్ పాండ్యా (25), జడేజా (45)తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
83 పరుగులకే సగం వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వుకుండా రాహుల్ నిదానంగా ఆడాడు. ఐదో వికెట్‌గా పాండ్యా వెనుదిరిగాక.. జడేజా, రాహుల్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. వీళ్లు సింగిల్స్, డబుల్స్ తీస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్‌బోర్డు వంద దాటించారు. ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్లు తీశారు.
లక్ష్యం చిన్నదే.. దాంతో, భారత్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ, జరిగింది వేరు. పిచ్ అనుకూలించడంతో ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ రెచ్చిపోయాడు. బంతిని స్వింగ్ చేసిన అతను పవర్‌ప్లేలో కీలకమైన వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో స్టార్క్, విరాట్ కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్ (0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. సూర్య వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్టార్క్ శుభ్‌మన్ గిల్ (20)ను ఔట్ చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అతని దెబ్బకు 52 రన్స్‌కే 4 వికెట్లు పడ్డాయి. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. కుదరుకున్నాక భారీ షాట్లు ఆడారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 రన్స్ కొట్టాడు. లబుషేన్‌తో కలిసి మూడో వికెట్‌కు 52 రన్స్ జోడించాడు. 129 పరుగుల వద్ద జడేజా, మార్ష్‌ను ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్ (26), కామెరూన్ గ్రీన్ (12), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (8), మార్కస్ స్టోయినిస్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో ఆసీస్ రెండొందల లోపే ఆలౌట్ అయింది. షమీ, సిరాజ్ తలా మూడేసి వికెట్లు తీశారు. జడేజా రెండు, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు.