ఎర్ర మట్టికోర్టు మహారాజు రఫెల్ నాదల్ (స్పెయిన్) ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ లో నార్వే ఆటగాడు, ఐదో సీడ్ క్యాస్పర్ రూడ్ ను 6-3, 6-3, 6-0 తో ఓడించి టైటిల్ నెగ్గాడు. నాదల్ కెరీర్ లో ఇది 14వ ఫ్రెంచ్ ఓపెన్. మొత్తంగా 22వ గ్రాండ్ స్లామ్ నెగ్గిన నాదల్.. అలనాటి టెన్నిస్ సంచలనం స్టెఫీగ్రాఫ్ (22 గ్రాండ్ స్లామ్స్) రికార్డును సమం చేశాడు. మరో రెండు గ్రాండ్ స్లామ్ లు గెలిస్తే ఈ దిగ్గజం ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తాడు.
పురుషుల సింగిల్స్ లో 22 గ్రాండ్ స్లామ్స్ సాధించిన ఆటగాడు నాదల్ ఒక్కడే. కానీ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలవాలంటే నాదల్ కు మరో రెండు టైటిల్స్ కావాలి. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలిచిన వారి జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) ఉంది. ఆ తర్వాత అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్) నిలిచింది.
తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడంతో నాదల్ (22), స్టెఫీ గ్రాఫ్ (22) తో సమానంగా నిలిచాడు. టాప్-3 లో ఉన్న ఈ ముగ్గురిలో నాదల్ తప్ప మిగిలినవారంతా మహిళలే కావడం విశేషం.
ఇక పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన వారిలో నాదల్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గి అత్యధిక గ్రాండ్ స్లామ్ లు (21) నెగ్గిన ఆటగాడిగా నాదల్ రికార్డులకెక్కాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి దానిని 22 కు పెంచుకున్నాడు. ఈ జాబితాలో జకోవిచ్ (20), ఫెదరర్ (20), సంప్రాస్ (14) లు తదుపరి స్థానాల్లో నిలిచారు.
కాగా.. మరో రెండు గ్రాండ్ స్లామ్ లు గెలిస్తే నాదల్.. మార్గరెట్ కోర్ట్ అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేస్తాడు. అంతకంటే ముందు అతడు సెరెనాను దాటాల్సి ఉంది. మరి ఈ నెల 27 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో నాదల్ పాల్గొనడం అనుమానంగానే ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ లో తాను ఆడిన ప్రతి మ్యాచ్ లకు ముందు పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్లు చేయించుకున్నానని ఫైనల్ అనంతరం నాదల్ తెలిపిన విషయం విదితమే.