వింబుల్డన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రొమేనియా స్టార్ సిమోనా హలెప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో హలెప్ 6-2, 6-4తో అమండ అనిసిమోవా(అమెరికా)పై అద్భుత విజయం సాధించింది. దీని ద్వారా ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో తన వరుస విజయాల సంఖ్యను 12కు పెంచుకుంది. 2019లో టైటిల్‌ల విజేతగా నిలిచిన హలెప్..2020లో టోర్నీ రద్దు కావడంతో నిలబెట్టుకోలేకపోయింది.
ఆ మరుసటి ఏడాది గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆస్ట్రేలియా స్టార్ ఆశ్లే బార్టీ టైటిల్ దక్కించుకుంది. మ్యాచ్ విషయానికొస్తే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హలెప్ తన అనుభవాన్నంతా ఉపయోగించుకుంటూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కోల్పోని ఈ రొమేనియా స్టార్ వింబుల్డన్‌లో మూడోసారి సెమీస్ పోరులో నిలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో స్పెయిన్ సా రఫెల్ నాదల్ 3-6, 7-5, 3-6, 7-5, 7-6(10/4) తేడాతో టేలర్ ఫ్రిట్జ్‌పై అద్భుత విజయం సాధించాడు. నాలుగున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నాదల్ విజయం కోసం తుదికంటా పోరాడాడు. అమెరికాకు చెందిన 11వ సీడ్ ఫ్రిట్జ్..నాదల్కు దీటైన పోటీనిచ్చి ఆకట్టుకున్నాడు. తొలి సెట్‌ను చేజార్చుకున్న నాదల్..రెండో సెట్లో గెలిచి పోటీలోకి వచ్చాడు. మరోమారు టేలర్ దీటుగా బదులివ్వడంతో నాదల్ మూడో సెట్ కోల్పోవాల్సి వచ్చింది. నాలుగో సెట్లో పుంజుకున్న రఫెల్ వెనుదిరిగి చూసుకోలేదు. నువ్వానేనా అన్నట్లు సాగిన ఆఖరి సెట్ టైబ్రేకర్‌కు దారి తీసింది. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ 10-4 తేడాతో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.