విశ్వ క్రీడా సంరంభం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాకర్ చరిత్రలోనే అత్యధిక వ్యయంతో తొలిసారి ఆసియాలో నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌కు ఆదివారం తెరలేచింది. అరబ్ సంప్రదాయాలను ప్రతిబింభిస్తూ జరిగిన ఆరంభ వేడుకలు ఆహుతులను కట్టిపడేయగా.. తొలి పోరులో ఈక్వడార్ చేతిలో ఆతిథ్య ఖతార్ ఓటమి పాలైంది.
దోహా : అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైంది. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థని, ఫీఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినొ, అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సౌదీ అరేబియా రాజు, ఈజిప్టు, టర్కీ, అల్జీరియా దేశాధ్యక్షులు ఆసీనులు కాగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల నడుమ వందలాది కళాకారులు నృత్య విన్యాసాలతో అలరించారు. లేజర్ కాంతులలో కళాకారుల నృత్యాలు మదిని దోచాయి. ఖతార్ సాంప్రదాయ ఖడ్గ నృత్యం అల్-అర్ధ మంత్రముగ్ధంగా సాగింది. గత ప్రపంచకప్ మస్కట్ స్టేడియంలోకి ప్రవేశించగా ప్రేక్షకులు పెద్దపెట్టున హర్షధ్వానాలతో స్వాగతించారు. అనంతరం ప్రస్తుత టోర్నీ మస్కట్ ‘లాయీబ్’ను గాలిలో తేలియాడిస్తూ స్టేడియంలో ప్రవేశపెట్టడం ఆహూతులను ఆకట్టుకున్నది. 1940ల్లో కామిక్ పుస్తకాలలో స్నేహపూర్వక భూతం కాస్పర్ పాత్ర స్ఫూర్తితో లాయీబ్ను రూపొందించారు. లాయీబ్ అంటే అతీత శక్తులున్న ఆటగాడు అని అర్ధం. ఈ పాత్ర ఆధారంగా గతంలో కొన్ని సినిమాలుకూడా రూపుదిద్దుకున్నాయి. దక్షిణ కొరియా పాప్ సింగర్, బిటిఎస్ బృంద గాయకుడు జంగ్‌కూక్ తన గానామృతంతో ప్రేక్షకులను సమ్మోహనపరిచాడు. ప్రపంచకప్కోసం కొత్తగా రచించిన డ్రీమర్స్ అనే సరికొత్త పాటను జంగ్‌కూక్ స్థానిక గాయని ఫాహద్ అల్ కుబైసితో కలిసి ఆలపించి వీనులవిందు చేశాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కొద్దిసేపు వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తికట్టించాడు. అనంతరం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ క్రీడలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ నిర్వహణ కేటాయింపులో ఖతార్ ఆవినీతికి పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆతిథ్యానికి ఎక్కడా లోటులేకుండా నిర్వాహకులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. ప్రపంచకప్ నిర్వహణకు సాటి అరబ్ దేశాలన్నీ తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న అతి పిన్న దేశం ఖతార్. తొలిసారి మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ టోర్నీని ఘనంగా కొనసాగించేందుకు నిర్వాహకులు కంకణబద్ధులయ్యారన్న సందేశం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిఫలించింది. మొత్తంగా ఫీఫా ప్రపంచకప్ హృద్యంగా ఆరంభమైందనడంలో సందేహం లేదు.
ఆతిథికి నిరాశ
ప్రారంభోత్సవానంతరం నిర్వహించిన ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశానికి నిరాశే ఎదురయింది. ‘ఎ’ గ్రూపులో కొద్దోగొప్పో విజయావకాశాలున్న మ్యాచ్‌లో ఖతార్ 0-3తో ఈక్వడార్ చేతిలో ఓడిపోయింది. ర్యాంకింగ్‌లో తనకంటె కేవలం నాలుగు స్థానాలు మెరుగైన ప్రత్యర్థిపై విజయంతో శుభారంభం చేయాలనుకున్న ఖతార్ ఆశలు అడియాశలయ్యాయి. గోల్సన్నీ ప్రథమార్థంలోనే నమోదయ్యాయి. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే 16వ నిమిషంలో ఎన్నర్ వాలెన్సియా తొలి గోల్ సాధించాడు. దీనితో ఖతార్ ఆటగాళ్లు గోల్‌కోసం ప్రత్యర్థి గోల్‌పై దాడులకు ఉపక్రమించారు. అయితే 31వ నిమిషంలో వాలెన్సియా మరో గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. స్కోరు సమం చేసే నేపథ్యంలో ముగ్గురు ఖతార్ ఆటగాళ్లు ఎల్లో కార్డుకు గురయ్యారు. విరామానికి 2-0 ఆధిక్యంలో నిలిచి ఈక్వడార్ ద్వితీయార్ధంలో గోల్ సాధించకపోయినా ఖతార్‌కు గోల్ అవకాశం దక్కకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ సమయంలో ఖతార్ రెండుసార్లు, ఈక్వడార్ నాలుగుసార్లు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను రంగంలోకి దింపాయి. మొత్తంగా ఖతార్‌కు చెందిన నలుగురు, ఈక్వడార్‌కు చెందిన ఇద్దరు ఎల్లోకార్డుకు గురయ్యారు. ద్వితీయార్ధంలోనూ గోల్ చేయడంలో విఫలమైన ఖతార్ ఓటమిపాలైంది.
నేటి మ్యాచ్‌లు