ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(42 బంతుల్లో 103, 7ఫోర్లు,9సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. చివర్లో శశాంక్సింగ్(36 బంతుల్లో 52 నాటౌట్, 2ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీతో పంజాబ్ భారీ స్కోరు అందుకుంది. ఖలీల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 201/5 స్కోరుకు పరిమితమైంది. కాన్వె (49 బంతుల్లో 69, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. దూబే (42), ధోనీ(27) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. ఫెర్గుసన్ (2/40) రెండు వికెట్లు తీశాడు. సెంచరీ చేసిన ప్రియాన్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
కాన్వె ఒక్కడే:
నిర్దేశిత లక్ష్యఛేదనలో చెన్నైకి మెరుగైన శుభారంభమే దక్కింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డేవాన్ కాన్వె పంజాబ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ముఖ్యంగా కాన్వె దూకుడు కనబరిచాడు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో బౌలింగ్ మార్పుగా వచ్చిన మాక్స్వెల్.. రచిన్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఫెర్గుసన్ బౌలింగ్‌లో డ్రైవ్ ఆడబోయిన రుతురాజ్..శశాంక్సింగ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(27 బంతుల్లో 42, 3ఫోర్లు, 2సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవైపు కాన్వె జోరుకు దూబే దూకుడు తోడవ్వడంతో లక్ష్యం అంతకంతకూ తగ్గుతూ పోయింది. వీరిని విడగొట్టేందుకు కెప్టెన్ అయ్యర్ చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఫెర్గుసన్ స్లోబాల్‌కు దూబే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాన్వె రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరగా, ఆఖర్లో ధోనీ(12 బంతుల్లో 27, ఫోర్, 3సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఉన్నంత సేపు బ్యాటు ఝులిపించిన మహీ అభిమానులను అలరించాడు. యశ్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం కాగా, ధోనీ వికెట్‌తో పాటు 9 పరుగులే వచ్చాయి.
శభాష్ ప్రియాన్ష్:
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాన్ష్ ఆర్య ఆటే హైలైట్. సహచర బ్యాటర్లు క్రమం తప్పకుండా పెవిలియన్‌కు చేరుతున్నా అతడు ఒంటరి పోరాటం చేశాడు. ప్రభ్‌సిమ్రన్ (0), శ్రేయస్ (9), స్టోయినిస్ (4), వధేర (9), మ్యాక్స్‌వెల్ (1) అలా వచ్చి ఇలా వెళ్లినా ఆర్య ఇన్నింగ్స్‌లో దూకుడు తగ్గలేదు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాదిన అతడు.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అశ్విన్ 12వ ఓవర్లో 2 సిక్సర్లు కొట్టి 80లలోకి వచ్చిన ఈ ఢిల్లీ కుర్రాడు.. పతిరాన 13వ ఓవర్లో 6, 6, 6, 4తో 39 బంతుల్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 13 ఓవర్లకు పంజాబ్ 151 స్కోరు చేస్తే అందులో ఆర్య చేసిన పరుగులే 100. దూకుడుగా ఆడే క్రమంలో అతడు.. నూర్ వేసిన 14వ ఓవర్లో నిష్క్రమించినా ఆఖర్లో శశాంక్ సింగ్, యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి కింగ్స్‌కు భారీ స్కోరును అందించారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో మెరుపులు మెరిపించిన ప్రియాన్ష్‌ను మెగా వేలంలో పంజాబ్ 3.8 కోట్లకు దక్కించుకుంది. డీపీఎల్‌లో సౌత్‌ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ 24 ఏండ్ల యువ క్రికెటర్..పంజాబ్ తరఫున దుమ్మురేపుతున్నాడు.
సంక్షిప్త స్కోర్లు:
పంజాబ్: 20 ఓవర్లలో 219/6 (ఆర్య 103, శశాంక్ 52 నాటౌట్, ఖలీల్ 2/45, అశ్విన్ 2/48)
చెన్నై: 20 ఓవర్లలో 201/5(కాన్వె 69, దూబే 42, ఫెర్గుసన్ 2/40, మ్యాక్స్‌వెల్ 1/11)