ఛండీగడ్ : క్రీడల్లో మరీ ముఖ్యంగా సాంప్రదాయక గ్రామీణ క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించే పంజాబ్‌లో వీటి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రెజ్లింగ్, ఆర్చరీ మాదిరిగానే అక్కడ అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడగా ఉన్న కబడ్డీ.. గ్యాంగ్ వార్స్‌తో ‘నెత్తుటి కూత’గా మారుతున్నది. పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా పలుకుబడి ఉన్న కబడ్డీ ఆటగాళ్లే లక్ష్యంగా హత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత నెల 15న మొహాలీలో జరిగిన ఓ స్థానిక టోర్నీలో కబడ్డీ ఆటగాడిగానే గాక ఆ ఈవెంట్‌కు ప్రమోటర్‌గా ఉన్న కన్వర్ దిగ్విజయ్ సింగ్‌ను ఇద్దరు దుండగులు హత్య చేసిన ఉదంతం క్రీడా లోకాన్ని నివ్వెరపరిచింది. చుట్టూ జనం గుమిగూడి ఉన్న చోట సాయుధులైన దుండగులు పిస్తోల్‌తో కాల్పులు జరిపి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. 2025 నవంబర్లోనూ లూధియానాలకు చెందిన గుర్విందర్ సింగ్, తేజ్‌పాల్ సింగ్ కూడా ఇలాగే మరణించారు.
కన్వర్ హత్యకు తామే బాధ్యులమని బంబిహా గ్రూప్ ప్రకటించుకుంటూ.. 2022లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య చేశామని ప్రకటించుకుంది. ఈ బాంబిహా గ్రూప్ నాయకుడిగా ఉన్న దేవిందర్ కూడా గతంలో కబడ్డీ ప్లేయరే కావడం గమనార్హం. పంజాబ్‌లో ఒకప్పుడు కబడ్డీ అంటే యువకులు తమ సత్తా నిరూపించుకోవడానికి ఆడే ఒక క్రీడ మాత్రమే. కానీ స్థానికంగా ఉండే నేతల ధనదాహం, రాష్ట్రంలో పెరిగిన డ్రగ్ కల్చర్, భారీ నగదు బహుమతులు (ట్రాక్టర్లు, హార్లీ డేవిడ్సన్ బైకులు) ఆశజూపి నిర్వహిస్తున్న టోర్నీల్లో పాల్గొని యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నది. పోలీసులు, అధికార యంత్రాంగం సైతం దీనిపై ఛోద్యం చూస్తూ అంటీముట్టునట్టు వ్యవహరిస్తుండటంతో పంజాబ్‌లో కబడ్డీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతున్నది.