Punjab Kings : ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కోచింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకుంటోంది. పద్దెనిమిదో సీజన్లో చేజారిన ట్రోఫీని ఒడిసిపట్టాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్.. భారత మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహతులే (Sairaj Bahatule)ను లెగ్ స్పిన్నర్ కోచ్‌గా తీసుకుంది. అనుభవజ్ఞుడైన స్పిన్ స్పెషలిస్ట్ బహతులేను తమ టీమ్‌లో చేర్చుకుంది. సునీల్ జోషీ (Sunil Johsi) స్థానాన్ని బహతులే భర్తీ చేయనున్నాడని ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. సునీల్ 2023 నుంచి 2025 సీజన్ వరకూ పంజాబ్ స్పిన్ కోచ్‌గా సేవలందించాడు.
ఈ ఏడాది ఆరంభంలో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గానూ కొనసాగాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో చేరాడు. అయితే.. జట్టు వైఫల్యంతో ఆగ్రహంగా ఉన్న రాజస్థాన్ యాజమాన్యం సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ బహతులేను సైతం తప్పించింది. దాంతో.. ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది పంజాబ్ ఫ్రాంచైజీ. దేశవాళీతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ కోచ్‌గా పనిచేసన బహతులే పంజాబ్ స్పిన్ దళాన్ని రాటుదేల్చుతాడని ఫ్రాంచైజీ భావిస్తోంది. గతంలో.. బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు.
Spin Bowling Coach, Sairaj Bahutule is now a 🦁! 🔥 pic.twitter.com/xBGvDCYvyF
— Punjab Kings (@PunjabKingsIPL) October 23, 2025
‘రెండేళ్లుగా అంకితభావంతో పంజాబ్ కింగ్స్‌కు సేవలందించిన సునీల్ జోషీకి ధన్యవాదాలు. అయితే.. కొత్త కోచ్ కోసం చూస్తున్న మేము అనుభవజ్ఞుడైన సాయిరాజ్ బహతులేను తీసుకున్నాం. ఆటపై అతడికున్న అవగాహన, దేశవాళీ బౌలర్లను తీర్చిదిద్దడంలో ఆయన కృషి మా జట్టకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి’ అని పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీశ్ మీనన్ (Satish Menon) వెల్లడించాడు. పంజాబ్ కోచ్‌గా ఎంపికవ్వడం పట్ల బహతులే సైతం సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చే సీజన్లో ఫ్రాంచైజీకీ కోచ్‌గా ఉండడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని అన్నాడు.
‘పంజాబ్ జట్టు వైవిధ్యమైన క్రికెట్‌కు కేరాఫ్. జట్టులోని చాలామంది సత్తా ఉన్నవారే. ప్రతిభావంతులతో కూడిన టీమ్‌కు.. కోచింగ్ ఇవ్వడం, వాళ్ల నైపుణ్యాలను సానబెట్టడం నాకు దక్కిన గొప్ప అవకాశం’ అని బహతులే పేర్కొన్నాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, బ్రాడ్ హడిన్, జేమ్స్ హోప్.. వంటి దిగ్గజాలతో కలిసి పంజాబ్‌కు తొలి కప్ అందించే పనిలో నిమగ్నం కానున్నాడీ వెటరన్ స్పిన్నర్. ఇప్పటికే పంజాబ్‌లో చాహల్, హర్‌ప్రీత్ బ్రార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నారు. వీరిని బహతులే మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశముంది.