న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో క్వాలిఫయర్-2లో అడుగుపెట్టిన టైటాన్స్ ఫైనల్ బెర్తు దక్కించుకోలేకపోయింది. బుధవారం జరిగిన నాకౌట్ పోరులో టైటాన్స్ 45-50 తేడాతో పుణెరి పల్టాన్ చేతిలో ఓడింది. భరత్ హుడా 23 పాయింట్లతో మరోమారు విజృంభించాడు. దీంతో తొలి ఐదు నిమిషాల్లోనే టైటాన్స్ 10-1 ఆధిక్యం కనబరిచింది.
కెప్టెన్ విజయ్ మాలిక్(11) సూపర్-10తో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఆదిలో తడబడ్డా పల్టాన్ టీమ్.. ఆదిత్య షిండే(22), పంకజ్ మోహిత్(10)రైడింగ్‌తో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో పుణెరి ఒకసారి ఆలౌటైతే… నాలుగుసార్లు ఆలౌటైన టైటాన్స్ ఓటమి వైపు నిలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో దబాంగ్ ఢిల్లీతో పుణెరి పల్టాన్ తలపడుతుంది.