చటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగుతున్నది. తొలుత టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(22), శుభ్‌మన్ గిల్(20) జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజార(90) పది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(1) ఘోరంగా నిరాశపరిచాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం టీమ్ఇండియా టాపార్డర్‌ను దెబ్బతీశాడు.
పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ తైజుల్ చెలరేగడంతో 112 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో పుజార, శ్రేయాస్ అయ్యర్(82 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు బంగ్లా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఐదో వికెట్‌కు 149 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అక్షర్ పటేల్(14) ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఔట్ కాగా, తైజుల్ ఇస్లాం(3/84), మెహదీహసన్(2/71) రాణించారు.